ఆ నియోజకవర్గాల్లో కారు రథసారధి ఎవరు? ఇన్‌చార్జ్‌లను ఎందుకు నియమించడం లేదు?

నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడినా నష్టం లేదని తాను అందుబాటులో ఉంటానని..

ఒకరి తర్వాత ఒకరు. పది మంది వరుస పెట్టి హస్తం గూటికి చేరారు. కారు దిగిన ఆ ఎమ్మెల్యేల మీద యాక్షన్‌ అంటున్నారే తప్ప..ఎమ్మెల్యేలు వెళ్లిన నియోజకవర్గాల్లో మాత్రం ఇన్‌చార్జ్‌లను నియమించడం లేదు బీఆర్ఎస్ పార్టీ. దానం నాగేందర్‌తో మొదలైన వలసల పర్వం..తెల్లం వెంకట్రావు వరకు కొనసాగింది. అయిందేదో అయిపోయింది.

ఎమ్మెల్యేలు పోతే పోయారు. ఎవరో ఒక నేతను అయితే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను నియమించాలి కదా అంటున్నారు క్యాడర్. లీడర్లు లేకపోతే సర్లే అనుకోవచ్చు. నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పగ్గాలు చేపట్టి ముందుండి నడిపిస్తామని నేతలు ముందకొస్తున్నా..బాధ్యతలు అప్పగించకపోవడానికి కారణమేంటో అర్థం కావడం లేదంటోంది బీఆర్ఎస్ క్యాడర్.

అందరి కంటే ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆయన హస్తం గూటికి చేరి కూడా మూడు నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను ఏ నేతకు అప్పగించలేదు గులాబీ పార్టీ హైకమాండ్. అలాగే స్టేషన్ ఘన్‌పూర్‌, శేరిలింగంపల్లి, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల, గద్వాల్‌, చేవెళ్ల, పటాన్‌చెరు సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

మరి పార్టీ పటిష్ఠతపై ఫోకస్?
అయినా ఆ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను పెట్టలేదు బీఆర్ఎస్ అధిష్టానం. జంపింగ్ జపాంగ్స్‌ మీద విమర్శలు చేయడం..వేటు వేయించడం కోసం లీగల్‌ ఫైట్ చేయడమే తప్ప.. ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన సెగ్మెంట్లలో పార్టీ పటిష్ఠతపై మాత్రం ఫోకస్ చేయడం లేదంటున్నారు కార్యకర్తలు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లేకపోవడం తమకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ధర్నాలు, రాస్తారోకోల్లో అరెస్ట్ అయితే తమను విడిపించే నాయకుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మంచీ చెడును చూసుకునేదెవరో అర్థం కావడం లేదని అంటోంది ఆ పది నియోజకవర్గాల గులాబీ క్యాడర్.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పార్టీని వీడటంతో..నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతల కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న కొలను బాల్‌రెడ్డి, సోమిరెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్‌లు నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యతల కోసం హరీశ్‌రావును కలిసి ప్రయత్నాలను చేసుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడిన తెల్లారే హరీశ్‌రావు పటానుచెరులోని ఆదర్శ్‌రెడ్డి ఇంట్లో ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

బాధ్యతలు దక్కించుకోవాలని..
నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడినా నష్టం లేదని తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మెట్టు కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, కొలను బాల్ రెడ్డి, సోమిరెడ్డి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎవరికి వారు తమ సీనియార్టీని, అర్హతలను హరీశ్‌కు వివరిస్తూ నియోజకవర్గ బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.

ఒక్క పటాన్‌చెరులోనే కాదు..మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఆశిస్తున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తే..ఆ నేత ఎమ్మెల్యే టికెట్ ఆశించే అవకాశం ఉంటుంది. అందుకే నియోజకవర్గ ఇంచార్జ్‌ల విషయంలో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుందన్న ప్రచారం ఉంది.

జంప్ అయిన పది మంది ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు పడితే..వారిపై బలమైన అభ్యర్థులను బరిలోకి దించి..తమను కాదని వెళ్లిన నేతలను ఓడించి తీరాలని కసిగా ఉంది బీఆర్‌ఎస్. అందుకే వెంటనే ఇన్‌చార్జ్‌లను నియమించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. లీగల్‌ ఫైట్‌లో ఏదో ఒక అంశం తేలుతుందని.. అనర్హత పడే అవకాశం లేకపోతే..త్వరలోనే ఇన్‌చార్జ్‌ల నియామకం ఉంటుందని చెబుతున్నారు గులాబీ పార్టీ లీడర్లు.

మందు ప్రియులకు కిక్కే కిక్కు.. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల తర్వాత ఛీప్‌ రేటులో హైక్వాలిటీ లిక్కర్‌!