Rajagopal Reddy
సీఎల్పీ మీటింగ్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిది హాట్ డిబేట్.. ఎవరా ముగ్గురు..? ఎందుకు డుమ్మా కొట్టారు..? పార్టీపై వాళ్లు గుర్రుగా ఉన్నారా? పార్టీనే వాళ్లపై గుస్సా చేస్తుందా? ఆ పదవి దక్కనందుకే వాళ్లు సీఎల్పీకి దూరంగా ఉన్నారా? ఇంతకీ ఆ ముగ్గురి నెక్ట్స్ కార్యాచరణ ఏంటి? ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్‌గా వినిపిస్తున్న గుసగుసలేంటి? వాచ్ దిస్ స్టోరీ..
సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.. మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఈ ముగ్గురూ ముందున్నారు.. కేబినెట్ బెర్త్‌లకన్నా ఆశావహులు ఎక్కువ కావడం, లెక్కలు తేల్చడంలో అధిష్టానం ఆలస్యం చేయడంతో కేబినెట్ విస్తరణకు బ్రేక్‌లు పడుతూ వస్తున్నాయి.
ఐతే ఇప్పటి వరకు అంతా సైలెన్స్ మెయిన్‌టెన్ చేసిన నేతలు ఒక్కసారిగా రచ్చకెక్కారు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు పార్టీ అధిష్టానం తీరుపైనా అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతూ వచ్చారు.. దీంతో మ్యాటర్ కాస్తా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
మంత్రి పదవుల విషయంలో రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు ఒక్కోసారి బహిరంగంగా, ఒక్కోసారి పరోక్షంగా అధిష్టానంపైనే కాదు సీఎం రేవంత్ రెడ్డిపైనా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అటు గడ్డం వివేక్ సైతం తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అసలు మంత్రివర్గ విస్తరణ జరిగినా తమకు క్యాబినెట్ లో చోటు దక్కుతుందా అన్న ఆందోళన సైతం ఈ ముగ్గురిని వేధిస్తోందట.
సున్నితంగా మందలించారా?
సరిగ్గా ఇలాంటి సమయంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి ఈ ముగ్గురు డుమ్మాకొట్టారు. అయితే సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఈ అంశం తన పరిధి, పీసీసీ పరిధి దాటిపోయిందన్నారట. తమ అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పామన్న సీఎం..ఎవరికి మంత్రి పదవులివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయాన్ని అధిష్ఠానం ఇప్పటికే రిజర్వు చేసి పెట్టిందని తెలిపారు.
పదవుల విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పాలేగాని బహిరంగంగా విమర్శించడం తగదని సున్నితంగా మందలించారని తెలుస్తోంది. అంతే కాదు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని.. అందరూ సంయమనం పాటించాలని హెచ్చరించారు. ఎన్నోసార్లు పార్టీ పరంగా అవకాశాలు వచ్చి త్రుటిలో జారిపోయినా.. గీత దాటకుండా పనిచేయడంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారట సీఎం..
మంత్రిపదవులను ఆశిస్తున్న వాళ్లు విస్తరణ ఆలస్యమవ్వడంతో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, పరోక్షంగా అధిష్టానంపైనా, నేతలపైనా విమర్శలు గుప్పించడంపై కొద్ది రోజులుగా సీఎం కోపంగా ఉన్నారట. దీంతో సీఎల్పీ సమావేశంలో అలాంటి వారిపై సీఎం సీరియస్ అవుతారన్న ముందుస్తు సమాచారంతోనే ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారన్న చర్చ కూడా వినిపిస్తోంది.
ఇదే సమయంలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఈ ముగ్గురు ఎంతకీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో అసంతృప్తిలో భాగంగానే సీఎల్పీ సమావేశానికి రాలేదన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఐతే ఇలా ఎన్నాళ్లు పార్టీ అధిష్టానంపై అలకబూనుతారు, వాళ్లపట్ల అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు టీ-కాంగ్రెస్‌లో ఆసక్తిని రేపుతోంది.