New Project (2)
Woman End Her Life : భర్త మరణించటంతో, ఆ బాధను తట్టుకోలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. మెదక్ జిల్లా చిన్న శంకరం పేటకు చెందిన ముచ్చర్ల రమేష్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతను అదే గ్రామానికి చెందిన మల్లేశం, లక్ష్మిల పెద్ద కుమార్తె మహేశ్వరిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి తేజస్వి అనే కుమార్తె, అభి అనే కుమారుడు కలిగారు.
15 రోజుల క్రితం రమేష్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ ఘటనతో మహేశ్వరి మానసికంగా బాగా కుంగిపోయింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకుంది. ఆదివారం ఉదయం పాల ప్యాకెట్లు తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. 8 గంటలైనా మహేశ్వరి తిరిగి రాకపోవటంతో ఆమె అత్త విజయ, ఈవిషయాన్ని మహేశ్వరి తండ్రి మల్లేశానికి చెప్పింది.
ఆయన అన్నిచోట్ల వెతుకుతూండగా మహేశ్వరి ఉదయం చెరువు వైపు వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు చెప్పారు. వెంటనే మల్లేశం గ్రామంలోని పెద్ద చెరువు కట్ట వద్దకు వెళ్లి చూడగా అక్కడ మహేశ్వరి స్కూటీ, చెప్పులు కనపడ్డాయి. వెంటనే గజఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించగా మహేశ్వరి మృతదేహం లభ్యం అయ్యింది.
Also Read : Young Lady Cheating : డాక్టర్ అవ్వాలనుకుంది…. నేరస్థురాలు అయ్యింది
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమారుడు చనిపోయిన 15రోజులకే కోడలు ఆత్మహత్య చేసుకోవటంతో రమేష్ తల్లి విజయ రోదనలు వర్ణనాతీతం. పిల్లలిద్దరినీ నేనెలా సాకాలి అంటూ ఆమె రోదించటం పలువురి మనసులను కలిచివేసింది.