Top Headlines : మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు
రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించాలని తలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని వసతులు ఉన్న కారిడార్ వెంట మెట్రో ఎందుకని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Today Headlines in Telugu at 10PM
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు గన్ మెన్లను పోలీస్ శాఖ తొలగించింది.
ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు మొదలయ్యాయి. ఐఏఎస్ ఆమ్రపాలి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్ కి కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. శైలజా రామయ్యర్ ను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజా రామయ్యర్ ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇక, కేంద్ర సర్వీసులు పూర్తి చేసుకుని తెలంగాణ వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్ మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది.
శంషాబాద్ లోని భూముల వివాదంపై టీఎస్ హైకోర్టు తీర్పు
శంషాబాద్ లోని భూముల వివాదంపై టీఎస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. శంషాబాద్ లోని 181 ఎకరాల భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)వేనని స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. నవంబర్ 18న తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. హైకోర్టు నేడు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల చొరవతో హెచ్ఎండిఏ కేసు గెలిచింది.
కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్ధంగా వాడుకుంటామని వెల్లడించారు. ఉన్న వాటినే వాడుకుంటామని తెలిపారు.
వినూత్న పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లి సర్వే : చంద్రబాబు
వినూత్న పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లి సర్వే చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రజాభిప్రాయంతోనే అభ్యర్థులకు సీట్లు ప్రకటిస్తామని తెలిపారు.
ఢిల్లీకి చేరిన ఏపీ ఓట్ల పంచాయితీ
ఏపీ ఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. వైసీపీ, టీడీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ను వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు అంశంపై ఈసీ అధికారులతో విజయసాయి రెడ్డి, ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వం ఏపీలో భారీగా దొంగ ఓట్లను చేర్చిందని, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ను టీడీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదు : సీఎం జగన్
టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని సీఎం జగన్ అన్నారు. పవన్ ప్యాకేజీ స్టార్ అంటూ మరోసారి జగన్ విరుచుకుపడ్డారు.
విశాఖ అగ్నిప్రమాద బాధితులకు మంత్రి గుడివాడ, వైవీ పరామర్శ
విశాఖ అగ్నిప్రమాద బాధితులను మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి, వైవీ పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు.
జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలం: లోకేశ్
జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత లోకేశ్ అన్నారు. సర్కార్ నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందని విమర్శించారు.
ప్రభుత్వం వల్లే నష్టం..
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు నెలల తర్వాత మీడియా ముందుకొచ్చారు. మిగ్ చాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తరువాత పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటు విమర్శలు చేశారు. తుపాను వస్తుందని తెలిసినా రైతులను ప్రభుత్వం హెచ్చరించలేదని..ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారుని విమర్శించారు. 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నదని..రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శలు చేశారు.
పార్లమెంట్‌ను కుదిపేస్తున్న భద్రతా వైఫల్యం..
భద్రతా వైఫల్యం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్ లను సస్పెండ్ చేశారు. లోక్ సభా నియమాలను ఉల్లంఘించారని.. సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డారంటూ లోక్ సభ స్పీకర్ ఐదుగురు ఎంపీలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసారు.
మార్చిలోనే పరీక్షలు..
అమరావతి: ఏపీలో 10th, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతు..మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ లో ఎన్నికలతో విద్యార్ధులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్ధేశంతో మార్చిలోనే నిర్వహిస్తామని తెలిపారు. 10th, ఇంటర్మీడియట్ కలిపి మొత్తం 16లక్షల మద్య విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి ఉందని తెలిపారు. మార్చి 1 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
బేకరీలో పేలిన సిలిండర్
రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
రుషికొండపై కేంద్రం కమిటీ పర్యటన
విశాఖపట్నంలోని రుషికొండలో కేంద్ర పర్యావరణశాఖ కమిటీ పర్యటిస్తోంది. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. మూడు రోజుల పాటు విశాఖలో నిర్మాణాలకు కమిటీ పరిశీలించనుంది.
పలాసలో సీఎం జగన్ పర్యటన
శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.వైఎస్ ఆర్ సుజల ధార ప్రాజెక్టును ప్రారంభించారు. రూ700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.
ఆంక్షల వలయం
పార్లమెంట్ భద్రతా లోపం విషయంలో లోక్‌సభ సెక్రటేరియట్ కఠిన చర్యలు తీసుకుంది. లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం (డిసెంబర్ 13) జరిగిన భద్రతా లోపానికి సంబంధించి ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. లోక్‌సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసిన వారిలో.. రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు.
మాటకు మాట
కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగడం
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. మెడికోలపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.
మెట్రోకు బ్రేక్
రాయదుర్గం-శంషాబాద్ మెట్రో అలైన్‌మెంట్‌కు బ్రేకులు పడ్డాయి. రేవంత్ సర్కార్ నిర్ణయంతో సాఫ్ట్‌వేర్, రియాల్టీ రంగాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించాలని తలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని వసతులు ఉన్న మెట్రో కారిడార్ వెంట మెట్రో ఎందుకని ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనికి బదులు రద్దీగా ఉండే సెంట్రల్ హైదరాబాద్, తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో మెట్రో విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే 111 జీవో పరిధిలో అలైన్‌మెంట్ ఎలా చేశారని నిలదీశారు.
ఆస్పత్రిలో మంటలు..
విశాఖలోని జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.
కొత్త స్పీకర్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రకటించారు.
రాజకీయ రంగు..
పార్లమెంట్ దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. నిందితులలో ఒకరైన నీలమ్ కాంగ్రెస్ పార్టీ మద్దతురాలని..ఆమె గతంలో జరిగన రైతుల ఉద్యమంలో పాల్గొన్నదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఆమె పార్లమెంట్ పై దాడి కోసం మిగిలిన నిందితులను ప్రేరేపించిందని ఆరోపిస్తున్నారు.పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఒక ఉగ్రవాద కేసు అనీ.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను విచారించాలని కోరుతున్నాయి ప్రతిపక్షాలు. ఇటువంటి పరిణామాలతో కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
రిమ్స్ మెడికల్ కాలేజీలో ఘర్షణ..
ఆదిలాబాద్ రిమ్స మెడికల్ కాలేజీలో ఘర్షణ తీవ్రకలకలం రేపింది. మెడికల్ స్టూడెంట్స్ ..బయటి వ్యక్తుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవకాస్త పెద్దదికావటంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల పరస్పర ఘర్షణతో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు.
అగ్గి..బుగ్గి
కామారెడ్డి అయ్యప్ప షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటల్ని ఆర్పుతున్నారు.
కేటీఆర్‌కు పాలనానుభవం లేదు
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవకముందే పథకాలు అమలవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని పొన్నం గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పుడే ప్రారంభమైందని, రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని అన్నారు.
అన్నీ నెరవేరుస్తాం
కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కంటే బీఆర్ఎస్ ఎక్కువ హామీలు ఇచ్చిందని, వాటిని ఎలా నెరవేరుస్తారని ఆమె ప్రశ్నించారు. తాము ఇచ్చినవన్నీ అమలు చేస్తామన్న మంత్రి సీతక్క తెలిపారు.
ఉత్తర గాజాలో ఆకస్మిక దాడి
ఇజ్రాయెల్ కు గాజా మరోసారి షాక్ ఇచ్చింది. ఉత్తర గాజాలో హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 9మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ అదుపులో ఉత్తర గాజా ఉంది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగింది.
అయ్యప్పా.. ఇదేందయ్యా..!
శబరిమలకు భక్తజనం పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనం కోసం భక్తులు పడిగాపులు గాస్తున్నారు. రద్దీ మరీ ఎక్కువగా ఉండడంతో దర్శనానికి చాలా సమయం తీసుకుంటోంది.
దర్యాప్తు ముమ్మరం
లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై అఖిలపక్షం భేటీ అయింది. పార్లమెంట్ సెక్యూరిటీపై అన్ని పార్టీల నేతలు విస్తృతంగా చర్చించారు. కాగా, ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ టీమ్స్ ఆధారాలు సేకరించింది. వీటిని పరిశీలించి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నారు.
సీఎం జగన్ కీలక నిర్ణయం
YSR ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత చికిత్స లిమిట్ 25 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.