AP Politics: ఆ ఘనత మాదే.. ఏపీలో క్రెడిట్‌ వార్‌.. పార్టీల గేమ్..!

ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తూనే, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది.

AP Politics: ఆ ఘనత మాదే.. ఏపీలో క్రెడిట్‌ వార్‌.. పార్టీల గేమ్..!

Chandrababu naidu, YS Jagan (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 9:35 PM IST
  • ప్రతి ఇష్యూలో అప్పర్ హ్యాండ్ కోసం ఆరాటం
  • అటు టీడీపీ, ఇటు వైసీపీ డైలాగ్‌ వార్‌.. మైలేజ్ గేమ్
  • తప్పు అయితే వాళ్లది.. గొప్ప అయితే తమదన్నట్లుగా డైలాగులు

AP Politics: సీ పోర్టుల నుంచి..భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు..మెడికల్ కాలేజీల నుంచి గూగుల్ డేటా సెంటర్‌ వరకు. ఎవరి ఎత్తులు వారివి. ఎవరి వ్యూహం వాళ్లది. అభివృద్ధి నినాదంతో కూటమి జనం మెప్పు పొందే స్కెచ్ వేస్తుంటే..తమ హయాంలోనే పునాది రాయి వేశామని వైసీపీ గొప్పలకు పోతోంది.

ఇలా ఏపీ పాలిటిక్స్‌లో అధికార కూటమి, ప్రతిపక్షం వైసీపీ మధ్య క్రెడిట్ వార్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ప్రాజెక్ట్ ఏదైనా..డెవలప్‌మెంట్‌ మరేదైనా..తమ ఘనత అంటే తమ ఘనత అని..క్రెడిట్‌ గేమ్‌తో పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి పార్టీలు. వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే స్కెచ్ వేస్తోంది కూటమి. ఈ క్రమంలో క్రెడిట్ వార్..ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

లేటెస్ట్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తన కలల ప్రాజెక్టుగా, విజన్‌గా చెప్పుకుంటున్నారు. వైసీపీ మాత్రం జగన్ హయాంలోనే భూసేకరణ చేపట్టామని, కోర్టు కేసులు పరిష్కరించి తామే పనులు స్టార్ట్ చేశామని వాదిస్తోంది.

Also Read:కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేది ఆ రోజే? ఇటీవలి కాలంలో ఇలా ఎన్నడూ జరగలేదు.. 

అయితే అశోక్‌ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే..భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు తెచ్చారని టీడీపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తోంది. అంతేకాదు తాము భూములు సేకరిస్తే..జగన్ హయాంలో తిరిగి వాపస్ ఇచ్చారని కూడా టీడీపీ చెప్తోంది. ఈ క్లెయిమ్స్ ద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ తమ హయాంలో పునాదులు వేసినవే అని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వైసీపీ ప్లాన్.

హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాంటి వాదనే వైసీపీ వినిపించింది. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా సీమకు నీరందిస్తున్నామని చెప్పుకుంటే, వైసీపీ మాత్రం గత ఐదేళ్లలో తాము చేసిన ఖర్చు వల్లే ఇది సాధ్యమైందని క్లెయిమ్ చేసే స్కెచ్ వేసింది.

పీపీపీ విధానంపైనా అంతే
ఇక మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానంపై గళమెత్తిన వైసీపీ..ఆ ఇష్యూలో కూటమిపై సర్కార్‌పై పైచేయి సాధించేందుకు అన్ని స్కెచ్‌లు వేసింది. ఏకంగా కోటి సంతకాల సేకరణ పేరుతో నిరసన తెలిపి..పీపీపీకి ఇస్తే..తాము అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చింది. పైగా జగన్ వార్నింగ్‌కు భయపడే ఒక్కటంటే ఒక్క కాలేజీకి కూడా టెండర్లు దాఖలు కాలేదంటూ వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది. ఇక ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటోంది కూటమి సర్కార్.

వైసీపీ లీడర్లు మాత్రం జగన్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితమే..ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కారణమంటూ క్రిడెట్‌ గేమ్‌కు తెరదీస్తోంది. తాము తెచ్చిన కంపెనీలకు చంద్రబాబు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారనే ప్రచారంతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇక గూగుల్ డేటా సెంటర్‌ విషయంలో అయితే వైసీపీ క్రెడిట్‌ గేమ్‌ బూమరాంగ్ అయిందన్న చర్చ ఉంది. ముందుగా వైసీపీ నేతలు గూగుల్ డేటా సెంటర్‌ను తప్పుబట్టడం..ఆ తర్వాత జగన్ సమర్ధించడం..పైగా తమ హయాంలోనే ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నడిచింది.

క్రెడిట్ కోసం ప్రయత్నించడం కామన్
వైసీపీ ఆడుతున్న క్రెడిట్‌ గేమ్‌ వెనుక పెద్ద స్కెచ్చే ఉందట. మామూలుగా అయితే ఒక పని సక్సెస్ అయిందని.. అది ఎదుటివారికి మంచి పేరును తెచ్చి పెడుతుందని తెలిసినప్పుడే.. మిగతా వారు క్రెడిట్ కోసం ప్రయత్నించడం కామన్. ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడం, పెట్టుబడులు రావడం ఏపీకి జరిగిన మేలని వైసీపీ పరోక్షంగా ఒప్పుకుంటోంది. కానీ ఆ సక్సెస్ క్రెడిట్ కూటమికి వెళ్తే తమ పొలిటికట్ ఫ్యూచర్‌కు ఇబ్బంది కలుగుతుందని..తమ హయాంలో జరిగిన కృషిగా చెప్పుకునే ఎత్తులు వేస్తోంది.

అయితే కొన్ని సందర్భాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పుబట్టడమే ఎజెండాగా పెట్టుకోవడమే వైసీపీ వ్యూహాత్మక తప్పిదంగా చెబుతున్నారు. ప్రతీదాన్ని తప్పుబట్టడం కాకుండా..మంచిని మంచి అని..లోపాలు ఉంటే సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందన్న వాదనలు ఉన్నాయి.

ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తూనే, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది. అయితే ప్రభుత్వానికి వచ్చే పాజిటివ్ మైలేజీని తగ్గించాలనేదే వైసీపీ ప్లాన్ అంటున్నారు. అందుకే క్రెడిట్ వార్‌కు తెరదీసి..ప్రతీ ప్రాజెక్ట్‌ విషయంలో చర్చ..రచ్చ రెండూ జరిగేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్న టాక్ వినిపిస్తోంది. క్రెడిట్ వార్‌లో ఫైనల్‌గా ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారో వేచి చూడాలి మరి.