రగులుతున్న రాజధాని ప్రాంతం: గ్రామాల్లో భారీగా పోలీసులు

మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలు నేటితో పదోరోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతంలో రైతులు రాజధానిపై కేబినెట్ భేటీ సంధర్భంగా ఆందోళనను ఉదృతం చేసేందుకు సిద్ధం అయ్యారు. రాజధాని మార్పే తీర్పయితే ఆ ప్రాంతంలో మంటలే అని భావించిన పోలీసులు ముందుగానే నిరసనలకు అడ్డు చెప్పేందుకు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు.
సీఎం జగన్ నివాసం వైపు వెళ్లారంటూ రైతులను కస్టడీలోకి తీసుకుంటున్నారు. పోలీసు బలగాలతో గ్రామాల కట్టడి చేస్తున్నారు. రగులుతున్న రాజధాని ప్రాంతంలో రైతులు వేసుకున్న టెంట్లు తీసేస్తున్నారు పోలీసులు. సీఎం, మంత్రుల వాహనాలను అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముళ్లకంచెలు వేశారు. దీంతో రాజధాని పరిధిలోని గ్రామాల్లో హైటెన్షన్ నెలకొంది. దీంతో ముందుజాగ్రత్తగా తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాకులు, లాఠీలతో బస్సుల్లో పెద్ద ఎత్తున్న పోలీసు బలగాలు రాజధాని ప్రాంతానికి చేరుకున్నాయి. ఏపీ సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక దళాలు మోహరించాయి. గ్రామాల్లో యద్ధ వాతావరణం కనిసిస్తుంది. మరోవైపు వెలగపూడి, కృష్ణాయపాలెంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగించనున్నారు. ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఇవాళ బీజేపీ అధ్యక్షుడు కన్నా మౌన పోరాటం చేస్తారు.