సేవ్ ది నేషన్-సేవ్ డెమోక్రసీ : బ్లాక్ డ్రెస్‌లో బాబు ఢిల్లీ టూర్

ఢిల్లీ : ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలుస్తామన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం బిజీబిజీగా గడిపారు.
అసెంబ్లీ సమావేశాల తరువాత.. ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఎన్డీయేతర పక్షాలు నిర్వహించిన సేవ్ ది నేషన్-సేవ్ డెమోక్రసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈవీఎంల పనితీరు, వ్యక్తమవుతున్న అనుమానాలపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన ర్యాలీలపై సమాలోచనలు జరిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్న చంద్రబాబు…అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలుస్తామన్నారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామన్నారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తుందని మండిపడ్డారు. ఆ తర్వాత… టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత.. సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. అరగంటకుపైగా జరిగిన సమావేశంలో… ఈవీఎంల పనితీరులు, లోక్ సభ ఎన్నికల నిర్వహణపై చర్చించారు.