అమరావతి కళకళ : గ్రీన్ అండ్ బ్లూ సిటీ
విజయవాడ : ఏపి రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఏపీ రాజధాని అమరావతిలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున ఉద్యానవనాలు నిర్మించేందుకు సన్నద్ధమైంది. పచ్చదనంతో కళకళలాడే విధంగా పార్కులను తీర్చిదిద్దుతోంది. కృష్ణానది నుంచి న్యాయనగరం వరకు 300 ఎకరాల్లో శాఖమూరి పార్క్‌ను నిర్మిస్తోంది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అలరించేలా పార్కు…
పార్క్‌కు నాలుగు వైపులా ఇ8, ఇ9, ఎస్ 11, ఎస్ 12 రహదారులు ఉంటాయి. పార్కు చుట్టూ 4.4 కిలోమీటర్లు చెట్లు పెంచుతారు. పార్క్ మధ్యలో దాదాపు 50 ఎకరాల్లో భారీ జలాశయం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బోటింగ్, ఎత్తైన ఫౌంటేన్, లేజర్ షో ఏర్పాటు చేస్తారు. ఇక స్టార్ హోటళ్లు, పట్టాలు లేకుండా అయిస్కాంతంతో నడిచే రైలు, వెల్ నెస్ సెంటర్, స్నోవరల్డ్, వాటర్ స్పోర్ట్స్ నిర్మిస్తారు. మొత్తంగా ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా .. ఈ పార్క్ ఉండనుంది.
19 ఎకరాల్లో గాంధీ స్మృతి…
పార్కులో 19 ఎకరాల్లో గాంధీ స్మృతి వనం అభివృద్ధి చేస్తారు. దీని ప్రణాళిక, ఆకృతులను సిద్ధం చేస్తున్నారు. 20 ఎకరాల్లో అంబేద్కర్ సృతి వనం నిర్మిస్తారు. ఇందులో 125 అడుగుల ఎతైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. స్మారక గ్యాలరీ, బౌద్ధ ధ్యానకేంద్రం, గ్రంథాలయం ఏర్పాటు చేస్తారు. అంబేద్కర్ పార్క్ పక్కన దాదాపు 8 ఎకరాల్లో క్రాఫ్ట్ బజార్, శిల్పారామం తరహాలో యూంఫీ థియేటర్ ఉంటాయి. అంబేద్కర్ పార్కుకు రెండోవైపు 20 ఎకారాల్లో పూల తోట నిర్మిస్తారు. శాఖమూరు రిజర్వాయర్‌లో బోటింగ్ ఉంటుంది. 10 ఎకరాల్లో అడ్వెంచర్ పార్కు, 20 ఎకరాల్లో వెల్డర్ పార్కును అభివృద్ధి చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పార్కును నిర్మిస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.