సత్తెనపల్లిలో టెన్షన్ : కోడెలపై వైసీపీ కార్యకర్తల దాడి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తం. టీడీపీ-వైసీపీ-జనసేన కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు, వాగ్వాదం, తోపులాటలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు. రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ వాళ్లు కూడా ఎదురుదాడికి దిగారు. ఈ గందరగోళంలో కోడెల కిందపడిపోయారు. దీనికితోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. అలసటకు గురయ్యారు. వైసీపీ కార్యకర్తల దాడిలో కోడెల చిక్కా చిరిగినట్లు టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
కోడెలపై వైసీపీ కార్యకర్తల దాడి వార్తతో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అనుచరులు. కోలుకుని మళ్లీ పరిస్థితిని సమీక్షిస్తారా లేక ఇంట్లోనే ఉంది విశ్రాంతి తీసుకుంటారా అనేది తెలియటం లేదు. కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు స్పీకర్ గా కూడా పని చేశారు. అంత పవర్ ఫుల్ నేత, సీనియర్ లీడర్ పై ప్రతిపక్షం అయిన వైసీపీ కార్యకర్తలు దాడి చేయటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రతిపక్షంలోని పార్టీనే ఇలా దౌర్జన్యం చేయటం ఏంటని నిలదీస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పైనే వైసీపీ దాడులు జరగటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోడెలపై దాడి తర్వాత పోలీస్ బలగాలు మోహరించారు. లాఠీచార్జితో ఆందోళనకారులను తరిగికొట్టారు. పోలింగ్ బూత్ ల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఓటర్లు భయం లేకుండా ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టారు.