ఆర్టీసీ సమ్మె : ఖమ్మంలో జేఏసీ నేతల అరెస్ట్

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమ్మెకు మద్దతునిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు డిపో వద్ద నిరసన చేపట్టారు. డిపో దగ్గర భారీగా మోహరించిన పోలీసులు జేఏసీ నేతలను నిరసన చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.
తమను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్టీసీ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిరకుంశత్వంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.అరెస్టులతో ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేరనీ.. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
సమస్యల పరిష్కారానికి తాము సమ్మె చేస్తుంటే ప్రైవేటు బస్సులతో సర్వీసులు నడిపించటం అన్యాయమనీ..తమ హక్కుల కోసం పోరాడుతుంటే తమపైనే చర్యలు తీసుకుంటూ ఉద్యమాన్ని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోదంటూ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లోని 650 బస్సులు డిపోలీకే పరిమితమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో 670 బస్సులు..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 9 డిపోల్లోను బస్సులు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని 10 డిపోల్లోను..నల్లగొండ జిల్లాలోని 7 డిపోలో 650 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 601 బస్సులతో పాటు యాదగిరి గుట్టలోని 108 బస్సులు, మంచిర్యాల జిల్లాతో పాటు రాష్ట్రా వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలోను బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.