రాజధాని అమరావతిలోనే ఉంటుంది : పవన్ భరోసా
అమరావతి నుంచి రాజధాని తరలిస్తామనడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కులం రంగు పులిమి రాజధాని తరలింపు తప్పని అభిప్రాయపడ్డారు.

అమరావతి నుంచి రాజధాని తరలిస్తామనడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కులం రంగు పులిమి రాజధాని తరలింపు తప్పని అభిప్రాయపడ్డారు.
అమరావతి నుంచి రాజధాని తరలిస్తారని జరుగుతున్న ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఎక్కడికీ తరలి వెళ్లదని భరోసా ఇచ్చారాయన. రైతులు ఎవరూ కూడా తమ ప్లాట్లను అమ్ముకోవద్దన్నారు. కౌలు కోసం భూములు ఇవ్వలేదని.. భావి తరాల కోసం రైతులు భూములు ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబుపై కోపంతో రాజధానిని తరలించాలని అనుకోవటం దారుణం అన్నారు పవన్. ఆగస్టు 31, 2019 శనివారం మంగళగిరిలో రైతులతో సమావేశం అయ్యారాయన. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏది కూలగొడుదామా అని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై కోపంతో ప్రజల్ని శిక్షించడం ఎందుకని ప్రశ్నించారు.
జగన్ సర్కార్ ఇసుకతో ఆడుకుంటుందన్నారు. ఇసుకతో ఆడుకున్న గత ప్రభుత్వం ఏమైందో అందరికీ తెలుసన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. బొత్స సత్యనారాయణ తన పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. జగన్ మాయలో పడొద్దన్నారు. సీఎం కావాలని బొత్సకు ఏమూలనో ఉందని తెలిపారు. రైతులు భూములిచ్చింది ఏపీ ప్రభుత్వానికని.. వ్యక్తులకు కాదని స్పష్టం చేశారు. కౌలు కోసం రైతులు భూములు ఇవ్వలేదని చెప్పారు.
ప్రజలను గందరగోళానికి గురి చేసే వాఖ్యాలు చేయొద్దన్నారు. రైతుల కన్నీళ్లకు కారణమైతే పాతాళానికి పడిపోతారని హెచ్చరించారు. రైతుల ఆందోళన చూసే రాజధాని ప్రాంతంలో రెండు రోజులు పర్యటించానని తెలిపారు. రైతులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజధాని కోసం సమిష్టిగా పోరాడుదామని.. అందుకు అందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.