కాల్వలోకి దూసుకెళ్లిన కారు : అత్తా కోడళ్లు మృతి

ఖమ్మం జిల్లాలో అదుపు తప్పిన కారు సాగర్ కాల్వలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 9 నెలల గర్భిణి సహ ఇద్దరు మరణించారు. జిల్లాలోని గొల్లగూడెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్తుండగా కార్లో ఉన్న పోగుల మహీపాల్ రెడ్డి బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కారులోనే ఉన్న అతని తల్లి ఇందిర (45) భార్య 9 నెలల గర్భిణి స్వాతి(28), బయటకు రాలేక నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందారు.
మహబూబాబాద్ జిల్లా జయ్యారం మండలం చిన్నగూడురుకు చెందిన పొగుల మహీపాల్ రెడ్డి భార్య స్వాతి 9 నెలల గర్భిణి. తల్లి ఇందిరను తోడు తీసుకుని భార్య స్వాతికి పరీక్షలు చేయించేందుకు మహీపాల్ రెడ్డి ఆదివారం ఉదయం ఖమ్మం వచ్చాడు. ఒక ప్రయివేటు ఆస్పత్రిలో పరీక్షలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో గొల్లగూడెం వద్ద కారును రివర్స్ చేస్తుండగా…అదుపు తప్పి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకు వెళ్లింది. ప్రమాదాన్ని పసిగట్టిన మహీపాల్ రెడ్డి కారులోంచి కిందకు దూకేశాడు. కారులో ఉన్న అత్తా కోడళ్లు బయటకు రాలేక నీట మునిగి చనిపోయారు.
సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, స్ధానికులు కారుని బయటకు తీశారు.అత్తా కోడళ్ళ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చనిపోయిన స్వాతి కడుపులోని శిశువు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.