కలకలం : తెనాలి IT ఆఫీస్‌లో CBI సోదాలు

గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయంలో సీబీఐ దాడులు కలకలం రేపాయి. ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. వ్యాపారి దిలీప్ చౌదరి నుంచి రూ.2లక్షలు తీసుకుంటుండగా అధికారులు చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాయలంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరుగురు సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. సోమవారం (ఏప్రిల్ 29,2019) రాత్రి నుంచి సోదాలు జరుగుతున్నాయి.
తెనాలి ఐటీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీబీఐ రైడ్స్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. సోమవారం రాత్రి సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. తెనాలి గాంధీ చౌక్ లోని జీడిపప్పు వ్యాపారి దిలీప్ ను ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి లంచం డిమాండ్ చేశారు. రూ.2లక్షలు ఇవ్వాలని వేధించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి దిలీప్.. విశాఖలోని సీబీఐ అధికారులను ఆశ్రయించారు. దీంతో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేసి చంద్రశేఖర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు చంద్రశేఖర్ ని కోర్టులో హాజరుపరచనున్నారు.
ఐటీ ఆఫీస్ లో రక్తపు మరకలు కనిపించడం కలకలం రేపింది. చంద్రశేఖర్ సృహ తప్పి పడిపోయాడని, గాయమై రక్తం వచ్చిందని అనుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఏదో జరిగింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనను అరెస్ట్ చెయ్యకుండా సీబీఐ అధికారులను బెదిరించేందుకు చంద్రశేఖర్ ఏమైనా చేసుకున్నారా? లేక అనారోగ్యం పరిస్థితులు కారణమా? అనేది తెలియాల్సి ఉంది.