తహసీల్దార్ సిబ్బంది..కంప్యూటర్లపై పెట్రోల్ పోసిన రైతు

తహసీల్దార్ కార్యాలయానికి రైతులు రావటం కొత్త కాదు..కానీ ఇటీవల కాలంలో అది హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్ పోసి ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. నాటి నుంచి రైతులు తహసీల్దార్ కార్యాలయంలో చేస్తున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మరో రైతు రెవెన్యూ అధికారులపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయానికి లంబాడీపల్లికి చెందిన కనకయ్య పెట్రోల్ బాటిల్ తో వచ్చాడు. ఆఫీసులో ఉన్న కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. సిబ్బంది..అధికారులపై కూడా పెట్రోల్ పడింది. తనకు సంబంధించిన భూమి సమస్య పరిష్కరించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ..అగ్గిపెట్టె తీసుకుని నిప్పు పెట్టటానికి యత్నించాడు. దీంతో సిబ్బంది అంతా హడలిపోయారు. వెంటనే అక్కడే ఉన్న ఇతర రైతులు అడ్డుకున్నారు. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నిసార్లు తిరిగినా తన సమస్యను పరిష్కరించకుండా అధికారులు తిప్పుకుంటున్నారని కనకయ్య అవేదన వ్యక్తంచేశాడు. కాగా, కనకయ్య అతడి అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోందని అందుకే తాము పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి సమస్యను పరిష్కరించలేకపోయమని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. కానీ కనకయ్య గతంలో ఎప్పుడూ తమ ఆఫీస్ కు రాలేదని..ఇదే మొదటి సారని…కనకయ్యతో తాము మాట్లాడామనీ..పట్టా దారు పాస్ పుస్తకానికి సంబంధించిన పేపర్స్ తీసుకుని రావాలని సూచించామన్నారు.
ఎటువంటి పేపర్స్ తీసుకురాకుండా పాస్ పుస్తకం కావాలని కనకయ్య అంటున్నాడని.. తహసీల్దార్ ఫరూఖ్ అంటున్నారు. ఈ క్రమంలో కనకయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.