ఎనిమిది రోజులే గడువు.. కష్టపడండి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు పది రోజులు మాత్రమే గడువు ఉందని, 8రోజులు విశ్రాంతి లేకుండా పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమని, ఈ ఎన్నికల్లో సాంకేతికత టీడీపీకి కలిసి వస్తుందని చంద్రబాబు అన్నారు.
సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు పట్టుదలగా పనిచేయాలని, ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో బూత్ కన్వీనర్‌లు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. ప్రతి బూత్‌లో ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని, టీడీపీకి అందరి మద్దతు కూడగట్టాలని సూచించారు. వీవీప్యాట్ రశీదులపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని, వీటి ఉపయోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని చంద్రబాబు చెప్పారు.
పేదరికం నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామని, రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు రూ.3వేల పింఛను, 150 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా రూ.5 లక్షలు, చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో గృహ రుణాలను రద్దు చేశామని, 43 లక్షల పక్కా ఇళ్ల లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు. వీటన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.