ఆటోవాలా ఖాకీ డ్రెస్ లో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు అందించే కార్యక్రమం ప్రారంభించారు. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ఈ పథకాన్ని ఏలూరులో మొదలుపెట్టారు సీఎం జగన్.
నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను… అంటూ నేను ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు తిరగకముందే ఈ కార్యక్రమం చేపట్టినట్లు జగన్ చెప్పారు. ఆటో వాళ్ల గురించి కానీ టాక్సీ వాళ్ల గురించి ఆలోచించిన వాళ్లు దేశంలో ఎక్కడైనా ఉన్నారు అంటే అది ఏపీలోనే అని జగన్ అన్నారు.
ఈ పథకం కింద సొంతంగా ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీలను నడుపుకునే డ్రైవర్లకు చేయూత ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు వేసుకునే ఖాకీ డ్రెస్సుతో సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం స్వయంగా ఆటోవాలా డ్రెస్ వేసుకుని సభలో మాట్లాడటం, కార్యక్రమాన్ని ప్రారంభించటంతో ఆటోవాలాల ఆనందానికి అవధుల్లేవు. సీఎం జగన్ ఇలా ఖాకీడ్రెస్ వేసుకుంటారని ఊహించలేదన్నారు ఆటోవాలాలు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఇచ్చిన హామీని అమలు చేయటం, 10వేల రూపాయలు ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు.
పూటగడవడమే కష్టమైన సందర్భాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, లైసెన్స్ రెన్యూవల్, ఇన్సూరెన్స్, వాహనాల మరమ్మతులతో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆటో, కారు డ్రైవర్లకు మొత్తం లక్షా డెబ్బై నాలుగు వేల మందికి లబ్ధి చేకూరనుంది.