తిరుమలకు సీఎం జగన్.. ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు

తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం(30 సెప్టెంబర్ 2019) తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి చేరుకుని, సాయంత్రం 4గంటల 15నిమిషాలకు ‘అలిపిరి- చెర్లోపల్లి’ జంక్షన్‌లో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు జగన్.
తరువాత 5గంటల 15నిమిషాలకు తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేసి పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 7గంటలకు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొని రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. తరువాతి రోజు మంగళవారం(01 అక్టోబర్ 2019) ఉదయం విజయవాడకు బయలుదేరి తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు జగన్.