కౌన్సిల్ రద్దు అంత ఈజీ కాదు : మండలి డిప్యూటీ చైర్మన్

శాసన మండలిని రద్దు చేయటం అంత ఈజీ కాదని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం తిరస్కరించినట్లు కాదనీ అలాగని ఆమోదించినట్లు కూడా కాదని..ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానికి పంపించామని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించిన మండలిని సీఎం జగన్ రద్దు చేయవద్దని..వ్యక్తిపై ఉన్న కోపాన్ని వ్యవస్థలపై చూపించటం తగదనీ..ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్ జగన్ కు సూచించారు.
నిబంధనల ప్రకారమే చేశాం: మండలి చైర్మన్ షరీఫ్
మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు జరుగుతుందని మండలి చైర్మన్ షరీఫ్ అన్నారు. నరసాపురం నుంచి గన్నవరం విమానాశ్రయానికి కారులో వెళుతూ మార్గమధ్యలో ఉన్న పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రముఖ దర్గా వద్ద ఆగిన షరీఫ్ నమాజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుంది.. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత మేరకే మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు జరుగుతుందని స్పష్టంచేశారు.
కాగా విధానమండలిలో వికేంద్రీకరణపై విలక్షణ నిర్ణయం తీసుకున్న చైర్మన్ ఎంఏ షరీఫ్‌కు సొంత జిల్లాలో అపూర్వ మద్దతు లభించింది. స్వగ్రామమైన నరసాపురంలో స్థానికులు, పార్టీ ప్రముఖులు సన్మానించారు. ఆయన చిత్రపటానికి జిల్లా అంతటా క్షీరాభిషేకం చేశారు. పూలవర్షం కురిపించారు. స్వగ్రామం నరసాపురానికి వచ్చిన షరీఫ్‌ను అనేక మంది కలిసి అభినందనలు కురిపించారు. పాలకొల్లులో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద షరీఫ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.