జగన్ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

దశాబ్ధాల వివాదం అనంతరం ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత అయోధ్యలో ఎప్పుడు భూమి పూజ చేస్తారు. ఎప్పటిలోగా రామమందిరం కడతారు అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే వివాదాలకు కేరాఫ్ అయిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అమోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభ తేదీపై క్లారిటీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది 2020వ సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన రామమందిరానికి భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. 2022 నాటికి రామమందిర నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన సుబ్రమణ్యస్వామి.. తిరుమల శ్రీవారి ఆలయ ఆదాయ వివరాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో స్వామి వారి ఆదాయ ఆడిట్ వివరాలను కోర్టు ముందుంచాలని అభిప్రాయపడ్డారు. స్వామి వారి ఆదాయం, ఆభరణాల వివరాలను నిగ్గుతేల్చాలని అన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని సుబ్రమణ్యస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ స్వర్ణదేవాలయం తరహాలో స్వతంత్రంగా జరగాలని అన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. హిందూ విశ్వాసాలను గౌరవించేలా జగన్ ప్రభుత్వం చర్యలు ఉన్నట్లు చెప్పారు. హిందూ ధర్మాన్ని జగన్ పరిరక్షిస్తున్నారు అని అభిప్రాయపడ్డారు. అన్యమత ప్రచారం జరుగుతోందని ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని టీటీడీ పాలకమండలికి సూచించారు.