నేతలూ..మా కాలనీకి రావద్దు..మా టైమ్ వేస్ట్ చేయొద్దు

తూర్పుపాలెం : దేశవ్యాప్తంగా ఎన్నిల సందడి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు చైతన్యమవుతున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలోని ముత్యాల వారి కాలనీ వాసులు వినూత్నరీతిలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఓటుకు మించిన ఆయుధ లేదని అనుకున్న ఆ కాలనీ వాసులు..‘ఎన్నికల వేళ..ఇదే మంచి తరుణం’నాయకులపై తమ నిరసన తెలియజేసేందుకు అనుకున్నారు.
గత మూడున్నర దశాబ్దాలుగా మా సమస్యలు పట్టించుకోని ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మా ఓటు కూడా అడగడానికి రావద్దు అంటూ తేల్చిచెప్పేశారు ముత్యాల వారి కాలనీ వాసులు. తమ కాలనీ ఏర్పాటై 35 సంవత్సరాలైందని..కానీ ఇప్పటికీ కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదనీ వారు వాపోయారు. మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులకు..ప్రభుత్వం అధికారులకు ఎన్నిమార్లు తెలిపినా..వారు తమ సమస్యల గురించి పట్టించుకోలేదనీ..మరి తాము ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి నేతలకు ఓటువేసి ఏం ప్రయోజనం అంటు నిరసన తెలియజేస్తు..గ్రామం బయట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
‘రాజకీయ పార్టీలు మా ఓటు అడిగేందుకు మా కాలనీకి రావద్దు. మా విలువైన కాలాన్ని వృథా చేయవద్దు’ అంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంతేకాదండోయ్…కాలనీలోని రోడ్ల దుస్థితి, కాలువల పరిస్థితికి సజీవ సాక్ష్యాల్లాంటి కొన్ని చిత్రాలను కూడా ఆ ఫ్లెక్సీపై ప్రింట్ చేయించారు. దీనికి సంబంధించి ఆ కాలనీ వాసులు సంతకాలు కూడా చేశారు.