టెన్షన్ పెంచుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం

విజయవాడ: కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైకి విజయం తమదేనని మేకపోతు గాంభ్యీరం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం తెగటెన్షన్ పడిపోతున్నారు. గెలుపుపై మాలెక్కలు మాకున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా… అవి ఎక్కడ తప్పుతాయోనన్న భయం కనిపిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థుల్లో ఈ టెన్షన్ కాస్తా హైటెన్షన్‌గా మారిపోయింది.
ఏపీ లో రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒకటి. రాజధానికి పక్కనే ఉండటం, రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ టీడీపీ నుంచి బొండా ఉమ, వైసీపీ తరపున మల్లాది విష్ణు పోటీ చేశారు. ఇక్కడ కాపు సామాజిక వర్గంతోపాటు, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఐతే..గత ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ వైసీపీ తరపున ఇక్కడ ప్రచారం నిర్వహించినా కూడా కాపు ఓటర్లు మాత్రం టీడీపీకే జైకొట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి మల్లాది విజయం అంతా ఈజీ కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఐతే.. తన గెలుపుపై మాత్రం మల్లాది ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు చేసిన భూకబ్జాలు, అక్రమాలపై ప్రజలు విసుగెత్తిపోయారని చెబుతున్నారు. ఒక్కసారి జగన్‌కి అవకాశం ఇస్తే రాజన్న పాలన వస్తుందని ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉందంటున్నారు.
ఇక ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరావు గత ఎన్నికల్లో విజయం సాధించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బోండాకు గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ సపోర్ట్ కలిసొచ్చింది. దీనికితోడు బీజేపీతో పొత్తు కూడా కొంతవరకు లాభం చేకూర్చింది. ఐతే.. ఈసారి బీజేపీ, జనసేనతో పొత్తు లేకపోవడం.. పైగా జనసేన బలపర్చిన సీపీఎం నేత బాబూరావు మూడో అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో పరిస్థితులు మారిపోయాయి. కానీ.. గత ఎన్నికల్లో వైసీపీలో ఉన్న వంగవీటి రాధా.. ఇప్పడు టీడీపీలో చేరి తన తరపున ప్రచారం చేయడంతో.. కాపు సామాజికవర్గ ఓట్లు తనకే పడ్డాయనే ధీమాలో బోండా ఉన్నారు. దీనికితోడు తమ నాయకుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలో వేయి కోట్లతో అభివృద్ధి పనులు చేయించానని… ప్రజల తమ వైపే ఉన్నారని బోండా ఉమా చెబుతున్నారు.
వామపక్షాలు, జనసేన, బీఎస్పీ కూటమి అభ్యర్థిగా సీపీఎం నుంచి బాబురావు పోటీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. ప్రజలు తన కష్టాన్ని గుర్తిస్తారనే నమ్మకం ఉందన్నారు. తన ప్రత్యర్థుల్లో ఒకరు భూకబ్జాదారుడు.. మరోవ్యక్తి లిక్కర్ మాఫీయా డాన్ అని.. వారిద్దరు ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమని చెప్పారు. తప్పకుండా విజయం తననే వరిస్తుందని అశాభవం వ్యక్తం చేశారు బాబురావు. మొత్తానికి ఈసారి విజయవాడ సెంట్రల్‌లో పోరు హోరాహోరీగా సాగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మూడోపార్టీగా రంగంలోకి దిగిన జనసేన వల్ల ఎవరికి దెబ్బ పడుతుందోనని ఇటు టీడీపీ, అటు వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ.. పైకి మాత్రం ఎవరికి వారే తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిలో ఎవరిని విజయలక్ష్మీ వరిస్తుందో తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.