పవన్ కళ్యాణ్‌కు పిచ్చి పట్టింది: టీడీపీకి సుధాకర్ బాబు రాజీనామా

  • Published By: vamsi ,Published On : December 8, 2019 / 01:35 AM IST
పవన్ కళ్యాణ్‌కు పిచ్చి పట్టింది: టీడీపీకి సుధాకర్ బాబు రాజీనామా

Updated On : December 8, 2019 / 1:35 AM IST

కర్నూలు జిల్లాలో అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే నేతలు ఎప్పుడు అవకాశం వస్తుందా? పక్క పార్టీలోకి దూకెద్దాం అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన  మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం ప్రకటించారు.

అధికారం కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించిన సుధాకర్ బాబు.. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య బంధాలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక దేవస్థానాల్లో క్రైస్తవులు ఉన్నారని సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకులు దుష్ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో క్రైస్తవులకు అన్నీ చేస్తామని గుంటూరులో చర్చిలో మాట ఇచ్చి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని అన్నారు.

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌‌కి పిచ్చి పట్టిందని, క్రైస్తవ సమాజం గురించి పవన్‌ మరోసారి ప్రస్తావిస్తే బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుని ప్రకటిస్తానని తెలిపారు.

మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడైన సుధాకర్‌ బాబు.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు వైసీపీ వైపు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.