సీఎం Vs సీఎస్‌

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 01:20 AM IST
సీఎం Vs సీఎస్‌

Updated On : April 22, 2019 / 1:20 AM IST

AP CM చంద్రబాబు, చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య వార్‌ ముదురుతోంది. ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల చేసిన ఆరోపణలతో…. సీఎస్‌ పరిపాలనా వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు. దీంతో సీఎం వర్సెస్‌ సీఎస్‌ వార్‌ ఆసక్తికరంగా మారింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని కాదని.. ఆయనకంటే జూనియర్ అయిన పునేఠను చంద్రబాబు సీఎస్‌ చేశారు. దీంతో చంద్రబాబుపైన ఎల్వీ సుబ్రమణ్యం అసంతృప్తితో ఉన్నారు. పునేఠ ముందుగా రిటైడ్‌ కాబోతున్నారని.. అందుకే ఆయనకు అవకాశం ఇచ్చారన్న ప్రచారం జరిగింది. పునేఠ తర్వాత ఎల్వీ సుబ్రమణ్యమే సీఎస్‌ కాబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది.

ఇటీవల బాబు నేరుగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని టార్గెట్‌ చేస్తూ చేసిన ఆరోపణలు అసలు కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. జగన్‌పైనున్న కేసుల్లో ఎల్వీ సుబ్రమణ్యం సహనిందితుడని.. అలాంటి వ్యక్తిని చీఫ్‌ సెక్రెటరీగా ఎలా చేస్తారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయనపైనున్న వ్యతిరేకతను తెలియజేశాయి. వాస్తవానికి ఎల్వీపైనున్న కేసులను కోర్టు కొట్టివేసింది. అయినా సహ నిందితుడంటూ చంద్రబాబు ఆరోపణలు చేయడంపై ఎల్వీ అవమానంగా భావిస్తున్నారు. చంద్రబాబు తనను జగన్‌కు అనుకూలమైనవాడిగా భావిస్తున్నారని తేలడంతో.. ఎల్వీ సుబ్రమణ్యం తనదైన శైలిలో గతంలో జరిగిన పాలన వ్యవహారాలపై కూపీ లాగడం ప్రారంభించారు. దీంతో సీఎం వర్సెస్‌ సీఎస్‌ మధ్య ప్రచ్చన్నయుద్ధం మొదలైంది.

ఎన్నికల ముందు పసుపు కుంకుమకు 9వేల కోట్ల రూపాయలు, రైతు రుణమాఫీ నాలుగోవిడతకు 3,300 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 2,200 కోట్ల రూపాయల చెల్లింపులపై ఆర్థికశాఖ అధికారులను సీఎస్‌ ప్రశ్నించారు. కేబినెట్‌ ఆమోదంతో తెచ్చిన అప్పులపై కూడా అధికవడ్డీలకు ఎందుకు తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు. ఆర్థికశాఖలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న అధికారులు.. ఎస్వీ సుబ్రమణ్యం చేస్తున్న రివ్యూల వివరాలను, ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అప్‌డేట్‌గా సీఎంకు తెలియజేస్తున్నారు. 

సీఎస్‌, సీఎం మధ్య పోరు తట్టుకోలేక ఫైనాన్స్‌ సెక్రెటరీ  ముద్దాడ రవిచంద్ర సెలవుపై వెళ్లారని ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన వ్యవహారాల్లో ఎల్వీ సుబ్రమణ్యం వేలు పెడుతుండడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ చేసిన నిర్ణయాలపై ఎల్వీ సుబ్రమణ్యం కామెంట్లు చేయడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఎల్వీ సుబ్రమణ్యం తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదని స్పష్టం చేశారు. అప్పులు, వడ్డీరేట్లపై సీఎస్‌ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సర్వీస్‌ రూల్స్‌కే విరుద్ధంగా సీఎస్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఏమాత్రం తగ్గకుండా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఖండన ఇప్పించారు. సర్వీసులో ఉన్నందున తన వాయిస్‌ను రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల ద్వారా ఇప్పించారు. వారితో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడించి  సీఎంతో సై అంటే సై అన్నారు. దీంతో ఇద్దరి మధ్యపోరు మరింత తీవ్రరూపం దాల్చింది. మరి వీరిపోరు ఎటువైపు దారితీస్తుందో , ఏమలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.