భద్రాచలంలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సెప్టెంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో క్రమంగా భద్రాచలం గోదావరినీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తివేయడంతో దిగువన వరద ఉధృతి పెరిగింది. హుటాహుటిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు.
సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు 35.7 అడుగులుగా ఉంది. సెప్టెంబర్ 07వ తేదీ సాయంత్రానికి 42 అడుగులకు చేరుకుంది. స్నానఘట్టాలు నీట మునిగాయి. పర్ణశాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్‌లో సైతం అధిక ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నగరంలో కురిసిన వర్షానికి వన్‌టౌన్, త్రీటౌన్ ప్రాంతాల్లోని ఆయా ప్రధాన వీధులు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 8 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముంది.
Read More : తెలంగాణలో భారీ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు