జెరూసలెం తరహాలోనే తిరుమలలో సెక్యురిటీ

ఇటీవలికాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇజ్రాయిల్ తరహా సెక్యురిటీని పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.
రాష్టంలోని ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) భావిస్తోంది. ఇందుకోసం ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయాలని టిటిడి అధికారులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే యాత్రికుల కదలికలను పర్యవేక్షించడానికి, మెరుగైన సేవలను అందించడానికి ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థను మెరుగుపరచాలని టీటీడీ భావిస్తుంది.
ఇందులో భాగంగానే టీటీడీ అధికారుల బృందం ఇజ్రాయెల్‌ను ఫిబ్రవరిలో సందర్శించి, అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయనుంది. జరుసలెంలోని భద్రతను తిరుమల కొండపై పెట్టేందుకు సాధ్యం అవుతుందా? అనే కోణంలో కూడా టీటీడీ ఆలోచిస్తుంది.
ఈ క్రమంలోనే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్ జట్టి జెరూసలెం వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి చెప్పారు. దీనికోసం ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందటానికి ఒక ప్రతిపాదనను తీసుకుని రావాలని గోపీనాథ్ జట్టికి వెల్లడించినట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సందర్శించే తిరుమలలో పటిష్టమైన భద్రత అవసరం అని ఈ మేరకు సెక్యురిటీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే తిరుమలలో జనవరి నెలలో వచ్చే వైకుంఠ ఏకాదశికి 1,600మంది పోలీసులను నియమించాలని అధికారులు నిర్ణయించారు.