నంద్యాలకు పవన్ : SPY రెడ్డి కుటుంబానికి పరామర్శ

ఏపీలో ఎన్నికలయ్యాక కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దాదాపు నెలరోజుల తరువాత పర్యటన జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్… పోలింగ్ ముగిసిన తరువాత హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల హడావిడి ముగియడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
మే 11వ తేదీ శనివారం కర్నూలు జిల్లా నంద్యాలకు పవన్ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపునన నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి కన్నుమూసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎస్పీవై రెడ్డి చిత్రపటానికి నివాళుర్పిస్తారు. ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని అపుడు జనసేన పార్టీ వర్గాలు తెలిపినప్పటికీ, ఆ సమయానికి ఆయన రాలేదు. ఈ దృష్ట్యా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన వస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనను విడుదల చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలో లోక్ సభ స్థాననుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన ఎస్పీవై రెడ్డి… అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.