జగన్ లో ఫిడెల్ కాస్ట్రో .. గొర్రెల్లాగా టీడీపీలో చేరాం: జూపూడి

తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు మరో సీనియర్ నేత. ప్రకాశం జిల్లా సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా రాజాకీయ అరంగేట్రం చేసిన జూపూడి ప్రభాకర్.. వైఎస్‌కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఉన్నారు.
ప్రొఫెసర్ గా ఉన్న జూపూడి ప్రభాకర్‌ని వైఎస్ ఏరికోరి పార్టీలోకి తెచ్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచిన నేతల్లో ఒకరుగా జూపూడి ఉన్నారు. మీడియాలో ఎప్పటికప్పుడు బలమైన వాయిస్ వినిపించిన జూపూడి తర్వాతి కాలంలో తెలుగుదేశంలో చేరారు.
తెలుగుదేశం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన జూపూడి ప్రభాకర్.. ఎన్నికల తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా మాట్లాడిన జూపూడి.. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని, జగన్ ఆలోచన, ప్రభుత్వ పనితీరు తనకు ఎంతగానో నచ్చిందని అందుకే వైసీపీలో చేరినట్లు వెల్లడించారు.
పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, దళితులకు, గిరిజన, మైనార్టీలకు సీఎం పెద్ద పీట వేశారని అన్నారు. నిర్దిష్ట ఆలోచన సరళి లేని మేం గొర్రెల్లగా పక్కదారి పట్టామని.. అందరితో చేరి తాను కూడా టీడీపీలో చేరానని, జగన్ లో ఫిడెల్ కాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయని అన్నారు.
సీఎం జగన్ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని, పదవులు ఆశించి మాత్రం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కేవలం సైనికుడిలానే వైసీపీలో చేరినట్లు చెప్పారు. రాజకీయంగా నావైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటానని అన్నారు. జూపూడితోపాటు జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ కూడా వైసీపీలో చేరారు.