కేసీఆర్ చొరవతో కదిలిన నీరు: తీరనున్న తాగునీటి కష్టాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు తాగునీరు కోసం సీఎం కేసీఆర్ కర్నాటక ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా.. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు కర్నాటక జలాలను అధికారులు విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్‌లో తెలంగాణకు ఇచ్చేంత నీరు లేకపోవడంతో ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటిని విడుదల చేసి.. ఆల్మట్టి నీరు నారాయణపూర్‌కు చేరిన తర్వాత.. అక్కడి నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది.
నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో కర్ణాటకలోని గూగల్, గిరిజాపూర్ రిజర్వాయర్లను దాటుకొని నీరు జూరాలకు చేరాలి. దీంతో జూరాలకు నీరు చేరేందుకు వారం రోజులు పట్టనుంది. జూరాలకు చేరే నీటితో జూన్ రెండో వారం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి అవసరాలను సర్దుబాటు చేసుకోవచ్చునని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.