మంత్రి దేవినేనికి షాక్.. వైసీపీలోకి సోదరుడు

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 04:45 AM IST
మంత్రి దేవినేనికి షాక్.. వైసీపీలోకి సోదరుడు

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నేతల కప్పదాట్లు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన సోదరుడు చంద్రశేఖర్ ఊహించని షాకిచ్చారు. దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్‌ ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ కండువా కప్పి చంద్రశేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. 

కమెడియన్ అలీకి కండువా కప్పిన అనంతరం చంద్రశేఖర్‌‌ను పార్టీ కండువా కప్పి తీసుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ నేత వసంత్‌ కృష్ణ ప్రసాద్‌‌.. చంద్రశేఖర్‌ను వైసీపీ కేంద్రకార్యాలయం లోటస్‌పాండ్‌‌కు తీసుకొచ్చారు. వసంత్‌ కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాపై వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. అయితే సొంత సోదరుడే పార్టీ మారడంతో దేవినేనికి షాక్ తగిలినట్లు అయింది.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రశేఖర్.. అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మరుతున్నట్లు చెప్పుకొచ్చారు. అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా చేస్తుందని, పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందంటూ ఆరోపించారు. ఇదే సమయంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రామణుడి లంక నుండి విభీష్ముడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారంటూ వ్యాఖ్యానించారు. దేవినేని చంద్రశేఖర్, తాను రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.