నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 03:23 PM IST
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

మంచిర్యాల : కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా సర్కార్‌ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు నోటి మాటగానే మిగిలిపోతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పేద ప్రజలకు అరకొరగా వైద్యం అందిస్తున్నారు. 

ఆస్పత్రికి పోతే.. ఉన్నరోగాలు పోతాయంటారు… కానీ మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళితే లేని రోగాలు వస్తున్నాయంటున్నారు ఇక్కడికి వచ్చిన రోగులు. వసతుల లేమి కారణంగా తలసేమియా, విష జ్వరాలతో బాధపడే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది ఆస్పత్రి. పిల్లల వార్డు లేకపోవడం.. బాలింతలను ఇరుకు గదుల్లో ఉంచడం… ఇలా అడుగడుగునా సమస్యలకు నిలయంగా మారింది. విషజ్వరాలతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా బెడ్‌లు లేకపోవడంతో ఒకే బెడ్‌పై ఇద్దరు చికిత్స పొందుతున్నారు. దీంతో వ్యాధి తీవ్రత మరింత పెరిగి ప్రాణాల మీదికి వస్తుందని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు తగ్గుతాయని ప్రభుత్వాస్పత్రికి వస్తే రోగాలు తగ్గడం మాట పక్కన పెడితే కొత్త రోగాలు తగిలించుకొని పోవాల్సి వస్తుందంటున్నారు. 

కుక్క కరిచిందని  ఆస్పత్రికి వస్తే… ఇంజక్షన్ లేదని… తమనే ఇంజక్షన్‌ తెచ్చుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో ఉన్న అపరిశుభ్ర వాతావరణం వల్ల రోగాలు మరింత ఎక్కువవుతున్నాయంటున్నారు. ఆస్పత్రిలో కనీసం బాత్‌రూంలు కూడా శుభ్రం చేయడంలేదని.. రోగులు ఆందోళన చెందుతున్నారు. వార్డుల్లో కనీసం లైట్లు, ఫ్యాన్లు కూడా పనిచేయడంలేదంటున్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మంచిర్యాల ఆస్పత్రిని అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని రోగుల బంధువులు అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆస్పత్రిలో ప్రసవించిన బిడ్డను బాత్‌రూమ్‌లో వదిలివెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో శిశు మరణాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిపై ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించాలని కోరుతున్నారు ప్రజలు.