కాంగ్రెస్‌కు తలనొప్పులు : యాష్కీకి MP టికెట్‌..క్యాడర్ సహకరించేనా ?

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 02:23 PM IST
కాంగ్రెస్‌కు తలనొప్పులు : యాష్కీకి MP టికెట్‌..క్యాడర్ సహకరించేనా ?

నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నాయి. మధుయాష్కికి ఎంపీ టికెట్‌ ఇస్తే.. స్థానిక క్యాడర్‌ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ జిల్లాలో నేతల మధ్య సఖ్యత లేకపోవడం గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఒకప్పుడు ఈ పార్టీకి నిజామాబాద్‌కు కంచుకోట. ఇప్పుడు..దిక్కు తోచని పరిస్థితి ఉంది. నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. పార్టీలో ఉన్నవారు సైతం అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థిగా మధుయాష్కిని నిలబెడితే.. క్యాడర్‌ ఏ విధంగా సహకరిస్తోందనన్న చర్చ జరుగుతోంది. 

మొదటినుంచీ మధుయాష్కి నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ ఆశించ లేదు. భువనగిరి లేదా మల్కాజిగిరి స్థానాల బరిలో నిలవాలని..ఇందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మల్కాజిగిరి స్థానం రేవంత్‌ రెడ్డికి ఖరారయి పోయాయి. మధుయాష్కికి నిజామాబాద్‌ ఎంపీ స్థానం దక్కే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

2004, 2009లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటి చేసి గెలిచారు యాష్కి. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై పోటి చేసి ఓడిపోయారు. ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు చూడలేదనే అపవాదు ఉంది. చుట్టపు చూపుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మొహం చూపించి వెళ్లిపోతారన్న టాక్ లోకల్ గా ఏక్కువ ఉంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున సరిగ్గా ప్రచారం చేయలేదన్న విమర్శ వినిపిస్తోంది. మరికొన్ని పరిణామాల మధ్య మధుయాష్కికి టికెట్‌ ఇస్తే క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే అయినా… స్థానిక ప్రజలతో సత్సంబంధాలు తెగిపోవడంతో మధుయాష్కికి టికెట్‌ ఇస్తే గెలుపు సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.