భారత్ చేరిన 20మంది తెలుగు జాలర్లు

  • Published By: chvmurthy ,Published On : January 6, 2020 / 01:16 PM IST
భారత్ చేరిన 20మంది తెలుగు జాలర్లు

Updated On : January 6, 2020 / 1:16 PM IST

ఏడాది కాలంగా పాక్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం, జనవరి6వ తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం.తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన జాలర్లు. ఏపీ మత్య్సశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ వారిని అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకురానున్నారు. 

ఉపాధి కోసం గుజరాత్ వెళ్లిన ఏపీకి చెందిన జాలర్లు డిసెంబర్ 2018 లో పాక్ జలాల్లోకి వెళ్లటంతో వారిని పాకిస్తాన్ నౌకాదళం అరెస్టు చేసింది.  ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి  జయశంకర్ ను కలిసి జాలర్లను విడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇచ్చారు. ఈవిషయమై పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ పాకిస్తాన్తో చర్చలు జరిపింది.

ఉభయ దేశాల మధ్య జరిగిన చర్చలతో పాకిస్తాన్ జాలర్లను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. మొత్తం 22 మంది తెలుగు జాలర్లు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో 20 మంది ఇప్పుడు విడుదలయ్యారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందినవారు ఉన్నారు. మరో ఇద్దరు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారిని పాక్ త్వరలో విడుదల చేయనుంది. 

పాక్ జైళ్లలోని 20 మంది తెలుగు జాలర్లను డిసెంబర్5న పాకిస్తాన్ విడుదల చేసింది. వారిని రైలు ద్వారా లాహోర్ కు తరలించారు. అక్కడి ఇధి ఫౌండేషన్ వారికి నిన్నరాత్రి ఆశ్రయం ఇచ్చింది.  ఈ రోజు వారిని వాఘా సరిహద్దుకు తీసుకువచ్చిన పాక్ రేంజర్స్ భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు.