EVM పగలగొట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరెస్ట్

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్(183) లో ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన మధుసూదన్ గుప్తా.. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బూత్ లో తనకు సంబంధించిన నేమ్ కార్డు పెట్టలేదని ఆయన కోపంతో ఊగిపోయారు. ఓటింగ్ ఛాంబర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఎన్నికల అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పడానికి అధికారులు ప్రయత్నించినా గుప్తా వినలేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆయన అసహనంతో ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది.
ఆ తర్వాత పోలీసులతోనూ గుప్తా వాగ్వావాదానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను పగులగొట్టిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. జనసేన అభ్యర్థిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. గుప్తా వీరంగంతో ఒక్కసారిగా అక్కడున్న ఎన్నికల అధికారులు, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు షాక్ అయ్యారు. పోలింగ్ కేంద్రం దగ్గరకు భారీగా మధుసూదన్ వర్గీయులు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. వీవీప్యాట్లు కూడా సరిగా పనిచెయ్యట్లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.