కరీంనగర్, పెద్దపల్లిలో గెలుపుపై ఎవరికి వారే ధీమా

సార్వత్రిక ఎన్నికలు సజావుగా ముగిసినప్పటికి తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుందనేది అభ్యర్థులకు అంతు చిక్కడం లేదు. గతంతో పోలిస్తే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ శాతం ఊహించని రీతిలో తగ్గింది. అయితే తగ్గిన పోలింగ్ ఎవరిని గెలిపిస్తుంది…ఎవరిని ఓటమి పాల్జేస్తుంది? ఎక్కడ ఓట్లు తగ్గాయి….ఎక్కడ పెరిగాయి అనే అంచనాలు వేస్తు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో 69.40 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలమని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కరీంనగర్ పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ కొంత ఓటు బ్యాంకును కోల్పోయినప్పటికీ…అంతిమ విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్.
టీఆర్ఎస్‌కు ఈసారి కరీంనగర్‌లో బీజేపీ బలమైన పోటినిచ్చింది. కరీంనగర్ సిటీలో గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి యువత ఓట్లు భారీగానే పడినట్లు అంచనాలు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మోడీ చరిష్మా, వరుసగా ఓటమి పాలవుతున్నారనే సానుభూతితో సంజయ్‌కి ఓట్లు అధికంగా పడి ఉంటాయిని… మెరుగైన ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నారు కమలం నేతలు.
ఇక పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 50.24శాతం పోలింగ్ నమోదు కాగా…గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని గులాబీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని హస్తం నేతలు అంచనాలు వేస్తున్నారు. ఇరు పార్టీల ఓటు బ్యాంకును బీజేపీ చీల్చిందనే అంచనాలు వేస్తున్నారు కమలం నేతలు భావిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికులు అధికంగా ఉండడంతో ఈసారి ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపారనేది మాత్రం అంతుపట్టడం లేదు. మాజీ ఎంపీ వివేక్ అనుచరులు కాంగ్రెస్ సహకరించారనే ప్రచారం సాగుతుంది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్‌కు వివేక్ ఓటు బ్యాంకు కలిసి వచ్చినట్లే. టీఆర్ఎస్ తరపున వెంకటేష్ నేత, కాంగ్రెస్ తరపున చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్ కుమార్ బరిలో నిలిచారు. అయితే ఇక్కడున్న ఆరు సెగ్మంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించడం కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గడంతో అభ్యర్థుల అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. విజయం ఎవరిని వరిస్తుందో…ఎవరు ఓటమి పాలవుతారో… ఓటరు నాడి ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే మాత్రం మే 23 వరకు ఆగాల్సిందే.