మారుతీరావు ఆత్మహత్య: ఆస్తుల కోసమే అమృతను బంధువులు రానివ్వలేదా?!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో పరువు పోవటంతో మారుతీరావు కిరాయి మనుషులతో కూతురు భర్త ప్రణయ్ను హత్య చేయించాడనే ఆరోపణలల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో కేసులు..వాయిదాలు..జైలుజీవితం..తరువాత బైటకు వచ్చిన నాటి నుంచి సుపారీగా ఇవ్వాల్సిన డబ్బు గురించి కిరాయి వ్యక్తులు డబ్బుల కోసం వేధింపులు..గత రెండు సంవత్సరాల నుంచి మారుతీరావు మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడితోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు.
కాగా మారుతీరావు బ్రతికి ఉండగా కేసుల నుంచి తప్పించుకోవటాని కావచ్చు..లేదా కూతురిపై మమకారం పోగొట్టుకోలేక కావచ్చు కారణం ఏదైనా అమృతను తిరిగి ఇంటికి తీసుకురావటానికి శతవిధాల యత్నించాడు. మధ్యవర్తులతో కబురు పంపించాడు. అలా రెండు మూడు సార్లు యత్నించగా..అమృత మరోసారి తండ్రిపై కేసులు పెట్టటంతో మారుతీరావును పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. కానీ తరువాత బెయిల్ పై వచ్చిన మారుతీరావుకు మనశ్శాంతిలేకుండా పోయింది.
ఈ క్రమంలో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవటం..మిర్యాలగూడ శ్మశాన వాటికలో అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. నీవల్లే మారుతీరావు చనిపోయాడు..నువ్వు వస్తే ఆయన ఆత్మశాంతించదు వెళ్లిపో అంటూ బంధువులు అమృతపై ఆరోపణలు చేశారు. కానీ.. కారణం అదికాదనీ..అమృత తిరిగి పుట్టింటికి దగ్గరైతే మారుతీరావు ఆస్తులు తమకు దక్కవనే కారణంతో అతని బంధువులు అమృతను అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి కూడా ఓ కారణముంది. ఆత్మహత్య సమయంలో మారుతీరావు సూసైడ్ నోట్ లో ‘‘అమృతను తిరిగి వచ్చేయమనీ..అమ్మదగ్గరకు వచ్చేయ్ అమృతా అని రాసిన నోట్ ను పోలీసులు గుర్తించారు. దీంతో అమృత తండ్రి మారుతీరావు మరణంతో వారంతా ఒకటి అయిపోతారనీ..ఆస్తులు అమృతకు ఇవ్వాల్సి వస్తుందనే అమృతను రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
లాయర్‌ను కలవటానికి వచ్చి ఆర్యవైశ్యభవన్‌లో ఆత్మహత్య..
ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి న్యాయవాదిని కలిసేందుకు శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో 306 సూట్‌ను అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో కారు డ్రైవర్ రాజేశ్‌తో కలిసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద గారెలు తెచ్చుకున్నాడు. రాజేశ్‌ను కారులోనే పడుకోమని చెప్పి..మారుతీరావు మాత్రం రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు రాజేశ్ వెళ్లి తలుపు తట్టగా మారుతీరావు నుంచి సమాధానం రాలేదు. ఉదయం 7.30 గంటలకు మరోసారి పిలిచా డు. స్పందనలేకపోవడంతో మారుతీరావు భార్య గిరిజకు, పోలీసులకు సమాచారమిచ్చా డు. అక్కడికి చేరుకొన్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. మంచంమీద విగతజీవిగా కనిపించాడు. బెడ్‌పై సెల్‌ఫోన్, దవాఖానకు సంబంధించిన ప్రిస్కిప్షన్, కారు పత్రాలతోపాటు ‘గిరిజా క్షమించు.. అమృతా, అమ్మ దగ్గరకు రా..’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. బెడ్‌పైన వాంతి చేసుకున్న ఆనవాళ్లు ఉండటంతో క్లూస్‌టీం సభ్యులు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
మొదట్లో మారుతీరావును ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో అనుమానించిన పోలీసులు పలు అనుమానాలను వ్యక్తంచేశారు. ఈ క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం తరలించారు. మారుతీరావు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వచ్చింది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలూ లేవనీ..పాయిజన్ ను గారెల్లో పెట్టుకని తినటం వల్లనే మారుతీరావు చనిపోయాడని డాక్టర్లు ప్రాథమికం రిపోర్టులో వెల్లడించారు.
పరువుహత్యతో పోయిన పరువు…ప్రణయ్ ను సుపారి ఇచ్చి చంపించాడనే ఆరోపణలు..
మారుతీరావు ఏకైక కుమార్తె అమృతవర్షిణి. అమృత 2018 మేలో మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రణయ్ కుమార్‌ను ప్రేమించి హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను కిరాయి వ్యక్తులు హత్య చేయగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు సెప్టెంబర్ 15న పోలీసులకు లొంగిపోయాడు. ఏడు నెలలపాటు జైలులోనే ఉన్న అతను బెయిల్‌పై బయటకు వచ్చి న తర్వాత మధ్యవర్తుల ద్వారా తన బిడ్డను ఇంటికి పిలిపించుకునేందుకు యత్నించాడు. అందుకు అమృత అంగీకరించలేదు. గత డిసెంబర్‌లోనూ మరోమారు మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి చేయగా అమృత పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు నమో దు చేసి రెండోసారి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో సైతం మారుతీరావు 20రోజులు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యాడు.
మారుతీరావును వెంటాడిన కేసులు..
ప్రణయ్ హత్య తరువాత జరిగిన పరిణామాల గురించి సైఫాబాద్ పోలీసులు మిర్యాలగూడ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హత్య కేసులో నల్లగొండ పోలీసులు పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టులో విచారణ తుదిదశకు చేరుకున్నది. ఈ కేసులో తనకు శిక్షపడే అవకాశాలున్నాయనే భయంతో మారుతీరావు మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల తన గోదాంలోనూ గుర్తుతెలియని మృతదేహం లభించడంతో పోలీసులు విచారిస్తున్నారు. ప్రణయ్ హత్య తరువాత కూతురితోపాటు దగ్గరి బంధువులు కూడా తనతో సరిగ్గా ఉండటం లేదనే ఆవేదనతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు సమాచారం.
డబ్బుల కోసం హంతకుల ఒత్తిడి.. ఫలితంగా ఆత్మహత్య
ప్రణయ్ హత్య కేసులో నిందితుల నుంచి మారుతీరావు బ్లాక్‌మెయిలింగ్‌కు గురైనట్టు తెలుస్తున్నది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో సుపారీ గ్యాంగ్‌తో మారుతీరావుకు విభేదాలు వచ్చినట్టు సమాచారం. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా మారుతీరావు ఉండగా.. సుభాష్‌శర్మ, హజ్గర్ అలీ, మహ్మద్‌బారీ, కరీం, శ్రవణ్, శివ నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మారుతీరావును బెదిరించి, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు అప్రూవర్లుగా మారుతామని బెదిరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్టు రావటంతో మారుతీరావుది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు.
See More:
* మారుతీరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత..అమృతా రావద్దు..ఆయన ఆత్మ శాంతించదు
* మారుతీరావు ఫోరెన్సిక్ నివేదిక : ఏ పాయిజన్ తీసుకున్నాడు..విస్రా శాంపిల్ సేకరణ