ఏపీలో ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ : ఏర్పాట్లు ముమ్మరం

ఏపీలో మే 6న రీ పోలింగ్ జరుగనుంది. ఐదు కేంద్రాల్లో రీ- పోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు చోట్ల రీ – పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావునపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్‌లో రీపోలింగ్ జరుగనుంది. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244 వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ బూత్‌లోనూ, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్ బూత్‌లోనూ రీపోలింగ్ జరుగనుంది. ఇక ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలపాడులోని 247వ పోలింగ్ బూత్‌లో రీ- పోలింగ్ నిర్వహించనున్నారు.
ఏపీలో జరిగిన పోలింగ్ సందర్భంగా ఈవీఎంల చాలా చోట్ల మొరాయించాయి. ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల సాయంత్రం పోలింగ్ మొదలై.. అర్థరాత్రి వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి పరిస్థితులను పరిశీలించిన అధికారులు ఈసీకి నివేదిక సమర్పించారు. ఈవీఎంలు మొరాయింపు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో ఐదు చోట్ల సోమవారం రీపోలింగ్ జరుగనుంది.
సోమవారం నిర్వహించనున్న రీ-పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతోపాటు ఎస్పీలు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏప్రిల్ 11న తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ద్వివేదీ సూచించారు. రీపోలింగ్ జరిగే కేంద్రాలన్నింటినీ సమస్యాత్మకంగా గుర్తించి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మరోవైపు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దఫా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బంధీగా ఎన్నిలకు నిర్వహించాలని ఎన్నికల అధికారులకు సూ`చించారు. ఓటర్లు ప్రశాంతవాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.