పాచిపోయిన చికెన్, డేంజర్ కెమికల్స్ : విశాఖలో రెస్టారెంట్లు, హోటళ్ల దుర్మార్గం

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 09:05 AM IST
పాచిపోయిన చికెన్, డేంజర్ కెమికల్స్ : విశాఖలో రెస్టారెంట్లు, హోటళ్ల దుర్మార్గం

Updated On : April 29, 2019 / 9:05 AM IST

పాచిపోయిన చికెన్, హానికారక కెమికల్స్, రంగులు.. విశాఖ జిల్లాలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు బరి తెగించాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఏమాత్రం నాణ్యతా  ప్రమాణాలు పాటించడం లేదు. క్వాలిటీ లేని ఆహార పదార్దాలను కస్టమర్లకు పెడుతున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్ లో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు  చేశారు. ఈ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఫ్రిజ్ లో వారం రోజులు నిల్వ ఉంచి చికెన్, ఇతర ఆహార పదార్దాలను వినియోగదారులకు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. రెస్టారెంట్లు, హోటల్స్ మాత్రం వారం రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్దాలను వినియోగిస్తున్నారు.

అనకాపల్లి కోర్టు దగ్గర ఉన్న బృందావన్ రెస్టారెంట్ లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రెడ్ చెర్రీలోనూ తనిఖీలు చేశారు. వారం రోజుల నుంచి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన చికెన్ వాడుతున్నట్లు  అధికారులు గమనించారు. ఆహార పదార్దాల్లో కలర్ ఎక్కువగా కలుపుతున్నారని గుర్తించారు. ఆహార పదార్దాల తయారీలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుసుకున్నారు.  అంతేకాదు అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం కింద ఇవ్వాల్సిన గుడ్లు హోటల్స్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. నగరంలో రాజు చికెన్ సెంటర్, పీపుల్ చాయిస్స్ రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. అనకాపల్లి, నర్సీపట్నంలోనూ దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లు, హోటల్స్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ఫుడ్ క్వాలిటీ లోపించిందని నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.  దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ డీఎస్పీ శ్రావణి నేతృత్వంలో జిల్లావ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్ లో మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఫుడ్ ప్రమాణాలు పాటించడం లేదని.. రసాయనాలు, కలర్లు యథేచ్చగా వాడేస్తున్నారని చెప్పారు.

చికెన్, చికెన్ మసాలా సేల్ కానివి ఫ్రిజ్ లో నిల్వ ఉంచి మరుసటి రోజు వాటిని కస్టమర్లకు వేడివేడిగా సర్వ్ చేస్తున్నారని చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధం అన్నారు. అలాంటి ఫుడ్ తినడం ఆరోగ్యానికి ప్రమాదం అని విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటిపై కేసులు నమోదు చేశారు. నర్సీపట్నంలో విజిలెన్స్ అధికారుల సోదాల్లో దారుణం వెలుగుచూసింది. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు హోటల్స్ లో కనిపించాయి. అవి అక్కడికి ఎలా వచ్చాయి? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.