నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 01:28 PM IST
నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన

Updated On : May 16, 2019 / 1:28 PM IST

ఓ వైపు రెవెన్యూ అధికారుల అవినీతిని ఎండగడుతూ ప్రక్షాళన దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నా… అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన చేపట్టారు. కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వకుండా రెండేళ్లుగా అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతు బంధు, వ్యవసాయ రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఆర్డీవో బషీరుద్దీన్ కు న్యాయం చేస్తానని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
 
నల్గొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్డీవో బషీరుద్దీన్ పట్టణ సమీపంలోని కడగల్లు మండల పరిధిలో 20 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి పట్టాదారు పట్టా పాస్ పుస్తకాలు బషీరుద్దీన్ పేరు మీదనే ఉన్నాయి. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెండేళ్లుగా బషీరుద్దీన్ ఆర్డీవో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. రేపు.. మాపు అంటూ పనిచేయకుండా అధికారులు తిప్పిచ్చుకోవడంతో విసుగు చెందిన ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 

ఇరవై ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన భూమికి అధికారులు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. రెండేళ్లుగా అధికారులు కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు. తనకు అక్కడ భూమే లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతో తనకు రైతు బంధుతోపాటు వ్యవసాయ రుణం అందటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

బషీరుద్దీన్ తనయుడు న్యాయవాది, మరో తనయుడు సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. చుదువుకున్న వారు.. నిబంధనలు తెలిసినవారు. బషీరుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బషీరుద్దీన్ ఆందోళనపై ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. అన్ని వివరాలు తెలుసుకుంటామని.. విచారణ జరిపి న్యాయం చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు.