ఏపీ ఖజానా ఖాళీ: ఉద్యోగుల జీతాలకు నిధుల్లేవ్

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 03:43 AM IST
ఏపీ ఖజానా ఖాళీ: ఉద్యోగుల జీతాలకు నిధుల్లేవ్

Updated On : April 29, 2019 / 3:43 AM IST

ఓవైపు ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలలోకి నేతల భవితవ్యం చేరిపోయింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది. అయితే రాష్ట్ర ఖజానా మాత్రం ఖాళీ అయ్యింది. సామాజిక పింఛన్ల కోసం వేజ్‌ అండ్‌ మీన్స్‌(చేబదుళ్లు), ఓవర్‌ డ్రాఫ్ట్‌నకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు చేస్తే గానీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.8,000 కోట్ల అప్పు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్‌ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్‌ 9వ తేదీన ఏకంగా రూ.5,000 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పులను 20 సంవత్సరాల్లో చెల్లించాలి. ఒకే నెలలో ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగా.. ఏప్రిల్‌ 16వ తేదీన మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే అందుకు ఆర్‌బీఐ ఒప్పుకోలేదు.

4నెలల కోసం రూ.8,000 కోట్ల అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తే, ఒకే నెలలో రూ.5,000 కోట్ల అప్పు చేసి, వెంటనే మరో రూ.1,000 కోట్ల అప్పు ఎందుకు అంటూ ప్రశ్నించింది. నెలకు రూ.2,000 చొప్పున మాత్రమే ఓపెన్‌ మార్కెట్‌లో అప్పు తీసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో వచ్చే నెలలోనే రూ.2,000 కోట్ల అప్పు చేయడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేజ్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌ ద్వారా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు చెల్లించి, వచ్చే నెలలో అప్పు చేయడం ద్వారా ఓవర్‌ డ్రాఫ్ట్‌ను అధిగమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.