చిగురిస్తున్న ఆశలు : సాయంత్రానికి బోటు బయటకు వచ్చే అవకాశం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 రెండో రోజు కొనసాగుతోంది. బోటును గురువారం సాయంత్రంలోపు బయటకు తీసేందుకు ధర్మాడి టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. బోటు ఉన్న ప్లేస్‌ను గుర్తించిన ధర్మాడి బృందం… దాని చుట్టూ రోప్‌లు వేసి ఉంచింది. మరోవైపు విశాఖ నుంచి గజ ఈతగాళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లు వస్తే లోపలికి పంపి యాంకర్‌ని లాక్ చేయించి బయటకు తీస్తామంటున్నారు ధర్మాడి సత్యం.
బోటు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే నిర్ధారించిన ధర్మాడి బృందం బుధవారం వేసిన లంగరు జారిపోయి బయటకు వచ్చింది. దానికి అంటుకున్న పెయింట్ గుర్తులతో అది బోటే అనినిర్ధారించుకున్న ధర్మాడి టీమ్ ఆ ప్రాంతం చుట్టూ ఉచ్చు వేసింది. గజ ఈతగాళ్లతో సంప్రదింపులు జరుపుతూ… సంప్రదాయ పద్దతిలో పనులు కొనసాగిస్తోంది ధర్మాడి బృందం.గోదావరిలోనూ నీటి ప్రవాహాం తగ్గటంతో విశాఖపట్నం నుంచి వచ్చే గజ ఈతగాళ్లను లోపలకు పంపి బోటుకు లంగరు తగిలించి బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నారు.
బోటును లంగరు ద్వారా కదలించి ఉచ్చులో బిగించేలా చేస్తారు. వీరికి సహాయంగా కాకినాడ నుంచి మరోక టెక్నికల్ టీమ్ కూడా కచ్చలూరు వద్దకు చేరుకుంది. ధర్మాడి బృందంతో కలిసి బోటును బయటకు తీయాలని జిల్లా అధికారుల ఆదేశాలు అందిన నేపథ్యంలో… ఆ టీమ్ బోటు వెలికితీతలో ధర్మాడి టీమ్‌కు సాయం చేయనుంది. మొత్తం 3 బృందాలు సంయుక్తంగా గురువారం సాయంత్రానికి బోటును బయటకు తీస్తాయని భావిస్తున్నారు.