సింగరేణిలో సెక్యూరిటీ లోపాలు : విలువైన వస్తువులు దొంగల పాలు

ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకుండా ఆస్తుల రక్షణను గాలికొదిలేసింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో గతంలో ఓపెన్ కాస్ట్ గనుల నుంచి ఉత్పత్తి అయిన బొగ్గు పక్కదారి పట్టి కోట్ల రూపాయల నష్టం జరిగినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. కేవలం జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. బొగ్గు రవాణా జరిగే ప్రాంతాల్లోనూ లోడింగ్ చేసే ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో అక్రమ రవాణాను నిలువరించగలిగారు. దీంతో మిగతా చోట్ల సింగరేణి సంస్థ సామాన్లు చోరీకి గురవుతున్నాయి.
గతంలో బొగ్గును మాత్రమే దోచుకెళ్లిన దొంగలు ఇపుడు రూటు మార్చి సంస్థకు సంబంధించిన యంత్రాలు, ఇనుప, రాగి సామాన్లను దోచేస్తున్నారు. రామగుండం రీజియన్‌లోని గనులపై ఉన్న ఇనుప సామాను ఇలా దొంగల పాలవుతుండడంతో సంస్థకు భారీగా నష్టం వాటిల్లితోంది. 2019 జనవరి 23 న మందమర్రి ఏరియా ఆర్కె 1 గని పై 150 హెచ్‌పి హలర్‌కు బిగించిన ఇత్తడి బేరింగ్‌లను దొంగలు ఎత్తుకు పోయారు. దీంతో 500ల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో పాటు ఆరువందల మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇవ్వాల్సి వచ్చింది.
సింగరేణి విద్యుత్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఇనుప సామాను, రాగి సామాను మాయమవుతన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జీడీకె 11 గని స్టోర్ నుంచి విలువైన సామాగ్రి కూడా ఇలాగే చోరీకి గురయింది. ఈ సంఘటనకు కార్మికులను బలి చేసేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులంతా అధికారుల తీరుపై ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకె 1 ఏ గని పై విధులు నిర్వహిస్తున్న సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పై దొంగలు దాడి చేయడంతో పలువురు ఎస్ అండ్ పీసీ సిబ్బంది గాయాలపాలయ్యారు.
బొగ్గు రవాణా జరిగే ప్రాంతంలోనే కాకుండా మొత్తం సింగరేణి గనులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కోట్ల విలువైన ఆస్తులు చోరీ కాకుండా ఉంటాయని కార్మికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకోవాలని కోరుతున్నారు.