కడప జిల్లాలో టీడీపీకి షాక్ : వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 07:58 AM IST
కడప జిల్లాలో టీడీపీకి షాక్ : వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి

Updated On : March 30, 2019 / 7:58 AM IST

కడప : సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడం, పార్టీలో తగిన గుర్తింపు  లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో  ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. సాయిప్రతాప్ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. సాయిప్రతాప్ రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ తరపున రాజంపేట ఎంపీగా ఆరుసార్లు గెలుపొందారు.
Read Also : నోటాకు వ్యతిరేకంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వినూత్న ప్రచారం

2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో మంత్రి  కూడా అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో పరిణామాలు మారిపోయాయి. 2011లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన సాయిప్రతాప్… 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. వైఎస్ఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన వైసీపీలో చేరతారని భావించినా… 2016లో టీడీపీలో చేరారు. టీడీపీ తరపున మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నారు. చంద్రబాబు మాత్రం అవకాశం రాలేదు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు భార్య, టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు.

టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సాయిప్రతాప్… టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంలో క్లారిటీ లేదు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు సాయిప్రతాప్ టీడీపీని వీడటం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దిక్కుతోచని స్థితిలో తన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరడం జరిగిందని సాయిప్రతాప్ అన్నారు. రాయలసీమ సమస్యలపై సీఎం చంద్రబాబుకి 3 లేఖలు ఇచ్చాను అని చెప్పారు. ఇంతవరకు చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉందన్నారు. తనను రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉండమని అన్నారని.. కానీ తన పార్లమెంట్ పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఇంఛార్జ్‌కి పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకుంటే ఇవ్వలేదన్నారు. తన అల్లుడు సాయి లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగటం జరిగిందని.. చంద్రబాబు ఇవ్వలేదని చెప్పారు.

టీడీపీలో పరిస్థితి తనకు కన్నీళ్లు తెప్పించాయని సాయిప్రతాప్ అన్నారు. అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారమని వాపోయారు. డబ్బు లేని వాళ్లకి టీడీపీలో స్థానం లేదన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు.
Read Also : ఐపిఎల్-2019: నేడు రెండు మ్యాచ్‌లు.. గెలిచేదెవరు?