EVM స్ట్రాంగ్ రూంల వద్ద పాములు : నైట్ షిఫ్ట్..భయపడుతున్న పోలీసులు

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 01:05 PM IST
EVM స్ట్రాంగ్ రూంల వద్ద పాములు : నైట్ షిఫ్ట్..భయపడుతున్న పోలీసులు

Updated On : April 19, 2019 / 1:05 PM IST

పోలింగ్‌ పూర్తయ్యింది.. స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఈవీఎంలు చేరిపోయాయి. కౌంటింగ్‌కు చాలా రోజుల సమయం ఉండడంతో.. వాటిని సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. ఈసీ ఆదేశాలతో భారీ భద్రతను కల్పించిన పోలీసులకు.. ఇప్పుడు కొత్త భయం మొదలయ్యింది. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గరకు వస్తున్న శత్రువులను చూసి.. భయం భయంగా గడపాల్సిన పరిస్థితి. ఇంతకీ పోలీసులనే వణిస్తున్న ఆ శత్రువు ఎవరు..? 

విజయవాడకు సమీపంలోని గంగూరు ఇంజినీరింగ్‌ కాలేజి. ఇక్కడే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజవర్గాలకు సంబంధించిన ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ భద్రపరిచారు. ఈ ఈవీఎంలు జాగ్రత్తగా కాపాడడానికి మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.  మూడు షిఫ్టుల్లో పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. నిత్యం పర్యవేక్షించేందుకు ఒక డీసీపీతో పాటు  సీసీ కెమేరాలు నిఘా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రాత్రి సమయంలోనూ లైట్స్ మధ్య కాపలా కాస్తున్నారు. అయితే.. రాత్రిపూట వస్తున్న పాములే.. ఇక్కడి సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. 

స్ట్రాంగ్‌ రూమ్స్‌ పక్కనే ఉన్న పొదల్లోంచి పాములు రావడం వల్ల .. సెక్యూరిటీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని .. విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు అంటున్నారు. అయితే పాములను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గరున్న పోలీసులు మాత్రం.. ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయా అని ఎదురుచూస్తున్నారు..