అన్నం కోసం : కన్నకొడుకు ఉన్నా అనాధ

జగిత్యాల : ఒక్కగానొక్క కొడుకు.. కంటికి రెప్పలా కాపాడకుంటాడని కలలు కన్నదా తల్లి. ఆస్తినంతా కొడుకుకు కట్టపెట్టింది. కానీ ఆస్తి చేతికి రాగానే తల్లిని ఇంటి నుంచి గెంటేశాడా కొడుకు. ఇప్పుడు నిలువనీడలేక.. తినడానికి తిండిలేక అల్లాడుతుందా వృద్ధురాలు.. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోచంపేట. ఆసరా ఉంటేనే కానీ నడవలేని స్థితిలో దయనీయంగా కనిపిస్తోన్న వృద్ధురాలి పేరు నర్సవ్వ. కన్న కొడుకు ఉన్నా అనాధలా బతుకుతుంది. పట్టెడు అన్నం పెట్టేవారులేక అల్లాడుతోంది.
నర్సవ్వ.. ఉన్న ఆస్తినంతా కొడుకు పేరు మీదే రాసింది. ఆస్తి చేతిలో పడగానే కొడుకు అసలు రూపం బయటపెట్టుకున్నాడు. కన్నతల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. కనీసం అన్నంకూడా పెట్టడం లేదు. నర్సవ్వ పరిస్థితిని చూస్తే జాలేస్తుందని.. కానీ ఆమె కొడుకుకు బయపడి ఏం చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఉన్నత స్థితిలో ఉండి కూడా కన్నతల్లికి బుక్కెడు అన్నం పెట్టడంలేదని శాపాలు పెడుతున్నారు.