పసుపు-కుంకుమకు డబ్బులివ్వటంలేదని మహిళల నిరసన

టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం కింద రూ.ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న క్రమంలో ఒక పక్క ఎన్నికలు..మరోపక్క పసుపు-కుంకుమ నగదు పంపిణీ విషయంలో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో బ్యాంక్ అధికారులు మహిళలను మళ్లీ మళ్లీ రమ్మంటు తిప్పుతున్నారు. దీంతో మహిళలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చినా బ్యాంక్ వాళ్లు అదే సమాధానం చెబుతున్నారంటు మండిపడుతున్నారు. మరోపక్క సిబ్బంది కొరత ఉందని అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందని బ్యాంక్ అధికారులు అంటున్నారు.
ఫిబ్రవరి, మార్చిలో రెండు విడతల్లో రూ.6,000 అందజేయగా, చివరి విడత కింద రూ.4 వేలు వారి ఖాతాల్లో నగదు జమచేశారు. ఈ డబ్బులు డ్రా చేసుకోవటానికి బ్యాంకులకు వెళ్తున్న మహిళలు ఎండల్లో అన్నిసార్లు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ఒకేసారి వస్తున్నారనీ అందుకే ఇవ్వలేకపోతున్నామనీ బ్యాంక్ వారు అంటుంటే దాన్ని సాకుగా చూపించి చెక్కులను కూడా జమ చేసుకోవడం లేదు. దీంతో పలు చోట్ల బ్యాంకుల ఎదుట మహిళలు ఆందోళనలకు దిగారు. రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేపట్టి బ్యాంకు అధికారుల తీరుపై నిరసన తెలుపుతున్నారు. దీనిపైదృష్టి పెట్టిన అధికారులు నగదు ఎక్కడ అందడం లేదో సమాచారం తెప్పించుకుని బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు బ్యాంకు అధికారులు.
పసుపు-కుంకుమ-2 పథకం కింద రూ.9,800 కోట్లను మూడు విడతల్లో ప్రభుత్వం ఇప్పటికే చెల్లించగా..చివరి విడతగా ఒక్కో మహిళకు రూ.4 వేల చొప్పున ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో బ్యాంకు ఖాతాలకు మళ్లించింది. దీంతో మహిళలు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 8)ఒక్కరోజునే రూ.1300 కోట్లు డ్రా చేసుకోగా, మంగళవారం సైతం పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ఈ క్రమంలో కడప ఐటీఐ కూడలి వద్ద కెనెరా బ్యాంకు ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో డబ్బులు ఇవ్వడం లేదని డ్వాక్రా మహిళలు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అయితే, పోలీసుల జోక్యం చేసుకోగా బ్యాంకు సిబ్బంది నగదు ఇస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళన విరమించారు.