ఖమ్మంలో విషాదం : ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ మృతి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. ఇతని మృతిపై కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికుడు చనిపోయాడంటూ ఫైర్ అవుతున్నారు. ఆస్పత్రి వద్దకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలాతో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడనే ఉన్న వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇతను మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే కారణమంటున్నారు కార్మికులు.
మరోవైపు ఖమ్మం జిల్లాలో కార్మికులు ఆందోళన చేపట్టారు. బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని లాగేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే..అడ్డుకోవడం సరి కాదంటున్నారు కార్మికులు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read More : ఖమ్మంలో టెన్షన్ : సొమ్మసిల్లిన మహిళా కండక్టర్