కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల మృతి టీడీపీ నేతలను షాక్ కు గురి చేసింది. టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కోడెల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్తలను టీడీపీ నేతలు ఖండించారు. కోడెల ఆత్మహత్మ చేసుకునేంత పిరికి వాడు కాదని చెబుతున్నారు. కేసుల విషయంలో కోడెల మనస్తాపం చెందారని అన్నారు. కేసులతో కోడెలను అభాసుపాలు చేశారని, వేధింపులకు గురి చేశారని టీడీపీ నేతలు వాపోయారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటు అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంచి నాయకుడిని కోల్పోయామన్నారు. నిత్యం ప్రజలతో ఉండాలని కోడెల ఎప్పుడూ చెప్పేవారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకున్నారు.
కోడెల మృతి పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వీహెచ్ సంతాపం తెలిపారు. కోడెల మృతి పట్ల టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల చివరి శ్వాస వరకు పార్టీ కోసం పరితపించారని చెప్పారు. పల్నాడు ప్రాంతం పోరాటయోధుడిని కోల్పోయిందన్నారు. వ్యక్తిగతంగా గొప్ప స్నేహితుడిని కోల్పోయానని యనమల వాపోయారు.
కోడెల సూసైడ్ అటెంప్ట్ చేశారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నారు. సోమవారం(సెప్టెంబర్ 16,2019) ఉదయం ఈ ఘటన జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కోడెల చనిపోయారు. 2019 ఎన్నికల్లో కోడెల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత పలు కేసులతో కోడెల సతమతమవుతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు. గుంటూరులో తన అల్లుడి నివాసంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ కి వచ్చారు. 3 రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉన్నా.. ఆయన చేయించుకోలేదని తెలుస్తోంది. కోడెల కుమారుడు శివరామ్, కుమార్తెలపైనా కేసులు నమోదయ్యాయి