పండుగ చేస్కోండి : హైదరాబాద్ టూ కరీంనగర్ ఛార్జీ రూ.750

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. డబుల్..ట్రిపుల్ గా చార్జీలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు రూ.750 వసూలు చేస్తున్నారు. కరీనగర్ నుంచి జగిత్యాలకు రూ.150 ఉండగా.. కరీంనగర్ నుంచి వరంగల్ కు రూ.300లు చార్జీలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు దసరా, బతుకమ్మ పండుగలకు సొంత ఊర్లకు వెళ్లాలనుకునేవారి నుంచి రెండు మూడు రెట్లు అధిక చార్జీలు భారంగా మారాయి. ప్రత్యామ్నాయం లేకపోవటంతో అడిగినకాడికి ఇచ్చుకుంటున్నారు ప్రయాణికులు. పండుగ ఎలా ఉన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అయితే బస్సులు తిరగకపోవటంతో ఆఫీసులకు వెళ్లేవారు, పనులపై బయటకు వచ్చిన వారిపైనా సిటీ బస్సుల ప్రభావం పడింది. ఆటో ఛార్జీలు అమాంతం పెరిగాయి. క్యాబ్ రేట్లు అధికంగా ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దూరానికే ఆటోవాలాలు రూ.100 నుంచి రూ.150 అడుగుతున్నారు. ఆటో ఛార్జీ కనీసం 50 నుంచి 100 రూపాయలుగా చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రైవేట్ వాహనదారులకు కాసులు కురిపిస్తోంది.