కొండపై కొత్త రూల్ : శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఇక నుంచి జ్యూట్ బ్యాగ్ ల్లో పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఇక నుంచి జ్యూట్ బ్యాగ్ ల్లో పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమల : టీటీడీ ప్రక్షాళన కోసం తిరుమల కొండపై సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తీసుకువెళ్లడానికి జూట్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, క్యాన్స్ ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న చైర్మన్ ఇప్పుడు శ్రీవారి ప్రసాదం తీసుకెళ్లటానికి జూట్ బ్యాగులను ఆచరణలోకి తీసుకొస్తున్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా ఇది అమల్లోకి వచ్చింది.
టీటీడీ కోరిక మేరకు సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాభనష్టాలు చూడకుండా తయారీ ధరకే జనపనార సంచులను తయారు చేసి ఇవ్వటానికి అంగీకరించింది. ఇందుకోసం 4 వెరైటీల్లో జూట్ బ్యాగులను రూపొందించారు. సోమవారం (ఆగస్టు 26, 2019) నుంచి వీటి విక్రయాలు ప్రారంభించారు. భక్తులు స్వామి వారి ప్రసాదాలు తీసుకెళ్లటానికి మొదట్లో హాకర్లే దేవుడి బొమ్మలు ముద్రించిన ప్లాస్టిక్ కవర్లను లడ్డూ కౌంటర్ల దగ్గర విక్రయించేవారు. హాకర్ల ఆగడాలు నానాటికి పెరిగిపోవటంతో టీటీడీయే సొంతంగా కవర్లు ప్రింట్ చేసి విక్రయం ప్రారంభించింది. ఆ తర్వాత ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం ఉద్యమంగా మారడంతో నిబంధనల మేరకు 50 మైక్రాన్ల పైబడిన బయో డీగ్రేడబుల్ కవర్లను మాత్రమే తయారు చేయించి విక్రయిస్తూ వచ్చారు. ఇటీవల చిత్తూరు జిల్లావ్యాప్తంగా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రావడంతో టీటీడీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది.
సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన 4 రకాలు బ్యాగులు ఈ విధంగా ఉన్నాయి.
రూ.25 బ్యాగు : 5 నుంచి 6 లడ్డూల వరకు తీసుకెళ్లొచ్చు. దాదాపు కిలో బరువు మోస్తుంది.
రూ.30 బ్యాగు : 8 నుంచి 10 లడ్డూల వరకు తీసుకెళ్లొచ్చు. దాదాపు 2కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉంటుంది.
రూ.35 బ్యాగు : ఇందులో 15 లడ్డూలు తీసుకెళ్లే సామర్ధ్యం కలిగి ఉంది. ఇది 4 కిలోల వరకు బరువు మోస్తుంది.
రూ.55 బ్యాగు : దీనిలో పాతిక లడ్డూలు ఉంచుకునే వీలుంది. ఈ బ్యాగ్ 10 కిలోల బరువు మోయడానికి తయారు చేశారు.