అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోండి : ప్రభుత్వానికి అమరావతి రైతుల హెచ్చరిక

మూడు రాజధానులు అంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంపై అమరావతి ప్రాంతంలోని రైతులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి నడి రోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని అది గుర్తు పెట్టుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు వైసీపీ నేతలు చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలంటున్నారు.
క్రిస్మస్ పండుగకు తాము మాత్రం ఇంటిల్లిపాదీ నడిరోడ్డుపై కూర్చునే దుస్థితిలో ఉంటే..తమ పిల్లల భవిష్యత్తు ఏమిటానీ..తమ బతుకులు ప్రశ్నార్థకంగా మార్చివేసిన సీఎం జగన్ వారి స్వంత జిల్లా వెళ్లి కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నారనీ రైతులు విమర్శిస్తున్నారు. సీఎం జగన్ తల్లి విజయమ్మ నా బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని అందరినీ అడిగారని అలా అవకాశం ఇచ్చి.. సీఎంను చేస్తే..రైతుల కుటుంబాల్ని నడిరోడ్డుపైకి లాగారనీ ఇప్పుడు విజయమ్మగారు ఏంచేస్తున్నారు? కుమారుడికి విజయమ్మగారు చెప్పలేరా? మనకు ఓట్లు వేసిన ప్రజల్ని కష్టాల్లోకి నెట్టివేటయం సరైందేనా అని విజయమమ్మగారు చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.
అధికారం వచ్చాక ప్రజల అవసరం తీరిపోయినట్లుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారనీ..దీనికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని అమరావతి ప్రాంత రైతులు ఆవేదనతో హెచ్చరిస్తున్నారు.